'జవాన్‌' మూవీ రివ్యూ | Jawan Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Jawan Review: 'జవాన్‌' మూవీ రివ్యూ

Published Thu, Sep 7 2023 1:38 PM | Last Updated on Fri, Sep 8 2023 9:39 AM

Jawan Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: జవాన్‌
నటీనటులు: షారుక్‌ ఖాన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, ప్రియమణి, మాన్య మల్హౌత్ర, దీపికా పదుకోన్‌, సంజయ్‌ దత్‌ 
నిర్మాణ సంస్థ: రెడ్‌ చిల్లీస్‌
నిర్మాతలు: గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ
దర్శకత్వం: అట్లీ కుమార్‌
సంగీతం: అనిరుధ్‌ 
సినిమాటోగ్రఫీ: జీ.కే. విష్ణు
విడుదల తేది: సెప్టెంబర్‌ 7, 2023

బాలీవుడ్ కింగ్‌ షారుక్ ఖాన్- నయనతార నటించిన చిత్రం జవాన్. సౌత్‌ ఇండియా పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 7) విడుదల అయింది. బాలీవుడ్‌లో కొన్నేళ్లుగా బాద్ షాగా అలరిస్తున్నాడు కింగ్ ఖాన్ షారుక్ . తన డ్యాన్స్, యాక్టింగ్‍తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. పఠాన్‌కు ముందు సుమారు రెండేళ్ల పాటు బాలీవుడ్‌లో సరైన హిట్‌ లేకపోవడంతో అక్కడ సౌత్‌ సినిమాల హవా కొనసాగింది.

అలాంటి సమయంలో పఠాన్‌ విడుదల కావడం. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్‌ చేసి బాలీవుడ్‌ కింగ్‌ అనిపించుకున్నాడు. అలా పఠాన్‌ సినిమాతో బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన  షారుక్‌.. తాజాగా 'జవాన్‌'తో మరోసారి తన సత్తా చాటేందకు రెడీ అయ్యాడు. నయనతార, డైరెక్టర్‌ అట్లీ ఈ సినిమాతో హిట్‌ కొట్టి బాలీవుడ్‌లో తమ సత్తా నిరూపించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదుల అయిన జవాన్‌ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. 

‘జవాన్‌’ కథేంటంటే..
కథ ప్రారంభంలో నీటి ప్రవాహంలో పూర్తి గాయాలతో షారుక్‌ ఖాన్‌ (విక్రమ్‌ రాథోడ్‌) కొట్టుకొని వస్తాడు. అటవీ ప్రాంతానికి చెందిన కొందరు ఆయన్ను గుర్తించి చికిత్స అందిస్తారు. కొద్దిరోజుల తర్వాత అదే గ్రామస్తులపై కొందరు దుండగులు దాడులు చేసేందుకు వస్తారు. నిస్సాహయ స్థితిలో ఉన్న వారిని షారుక్‌ రక్షిస్తాడు.. అలా కథ ముందుకు వెళ్తున్న సమయంలో ముంబై నగరంలో ఒక మెట్రోను షారుక్‌ ఖాన్‌ (విక్రమ్‌ రాథోడ్‌) అండ్‌ టీమ్‌ హైజాక్‌ చేస్తారు.

ఆ టీమ్‌లో ప్రియమణి, మాన్య మల్హౌత్రతో పాటు మరో నలుగురు ఉంటారు. ఇండియన్‌ ఆర్మీలో పనిచేసే ఒక జవాన్‌ (షారుక్‌ ఖాన్‌) మెట్రోను ఎందుకు హైజాక్‌ చేశాడు. .? ఆ హైజాక్‌ సీన్‌లోకి ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతారకు (నర్మద) ఎలాంటి సంఘటనలు ఎదురౌతాయి..? విక్రమ్‌ రాథోడ్‌ కోసం ఆ అమ్మాయిలు ఎందుకు పనిచేశారు..? వెపన్స్‌ డీలర్‌గా ఉన్న విజయ్‌ సేతుపతితో ఆర్మీలో పని చేస్తున్న విక్రమ్‌ రాథోడ్‌కు ఎక్కడ విరోదం మొదలౌతుంది..? ఒక జవాన్‌పై దేశ ద్రోహి అనే ముద్ర పడటం వెనుక జరిగిన కథ ఏంటి..? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే.. 
యాక్షన్‌ రివేంజ్‌ సినిమాలు టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు అనేకం వచ్చాయి. కానీ ఇందులో మెసేజ్‌ ఓరియేంటేడ్‌ రివేంజ్‌ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. అన్ని సినిమాల మాదిరే దేశం కోసం ప్రాణాలు ఆర్పించే సైనికుడికే నష్టం జరిగితే దాని రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఈ కథకు మూలం. డైరెక్టర్‌ అ‍ట్లీ తమిళ హీరో విజయ్‌తో తెరి, మెర్సిల్‌, బిగిల్‌ వంటి వరుస బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీసి బాలీవుడ్‌లో అవకాశం దక్కించుకున్నాడు. ఆ మూడు సినిమాల మాదిరే జవాన్‌లో కూడా మంచి మెసేజ్‌ను ఇచ్చాడు.

ముఖ్యంగా ఇందులో సినిమా ప్రారంభంలో మెట్రో హైజాక్‌ సీన్‌ చాలా బాగుంటుంది. ఆ సీన్‌లో విక్రమ్‌ రాథోడ్‌తో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి మధ్య వచ్చే సీన్లు జవాన్‌కు ప్లస్‌ అవుతాయి. ఎందుకంటే కథలో మేజర్‌ సీన్లు ఇవే. ఫస్టాఫ్‌లో సినిమాకు ఇవే బలం. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏంటో గుర్తు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎలా ఉందో దర్శకుడు చెప్పిన విధానం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది. ఇలాంటి పలు సోషియల్‌ ఇష్యూలతో జవాన్‌ మొదటి భాగం ఉంటుంది. అవన్నీ కూడా గతంలో పలు సినిమాల్లో చూసినట్లు అనిపిస్తున్నా... షారుక్‌ నటన, యాక్షన్స్‌ సీన్స్‌ ముందు అవన్నీ ఆడియన్స్‌ పెద్దగా పంటించుకోరు. 

మెట్రో హైజాక్‌ చేసింది విక్రమ్‌ రాథోడ్‌ అయితే..  ఈ విషయంలో జైలర్‌గా ఉన్న ఆజాద్‌ను నయనతార అరెస్ట్‌ చేయాలని భావిస్తుంది. ఆ సమయంలో విక్రమ్‌ రాథోడ్‌, ఆజాద్‌కు ఉన్న బంధాన్ని ప్రియమణి రివీల్‌ చేసిన విధానం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్‌కు ముందు నుంచి జరిగే ఈ సీన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కానీ సెకండాఫ్‌లో కూడా మంచి యాక్షన్‌ సీన్‌తో కథ ప్రారంభం అయినా తర్వాత కొంత నెమ్మదిస్తుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్స్‌ అంతగా పండించవనే చెప్పవచ్చు.

ఈ సినిమాలో ఆజాద్‌ జైలర్‌ అయితే విక్రమ్‌ రాథోడ్‌ ఒక జవాన్‌ ఇద్దరూ కూడా దేశం కోసం పనిచేస్తున్నవారే.. కానీ ఒక 'జవాన్‌' తన ప్రాణాలకు తెగించి యుద్ద రంగంలో పాల్గొన్నప్పుడు.. శత్రువు కూడా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఇలాంటి సమయంలో 'జవాన్‌' చేతిలో ఉన్న గన్‌ పనిచేయకపోతే ఏం జరుగుతుంది..? దేశం కోసం రణరంగంలోకి దిగిన 'జవాన్‌' ప్రాణాలు పోతాయి. సేమ్‌ 'జవాన్‌' సినిమాలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సన్నివేశం తీసిన విధానం చాలా బాగుంటుంది.

ఎవరెలా చేశారంటే..
విక్రమ్‌ రాథోడ్‌, ఆజాద్‌ పాత్రలో షారుక్‌ ఖాన్‌ దుమ్ములేపారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్క్రీన్‌ ప్రంజెంటేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. యాక్షన్‌ సీన్స్‌తో పాటు సెంటిమెంట్‌ సీన్స్‌ పండించడంలో షారుక్‌ ఎక్కడా తగ్గలేదు. జవాన్‌తో నయనతార బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆజాద్‌కు భార్యగా, మరో బిడ్డకు తల్లిగా, ఒక పోలీస్‌ ఆఫీసర్‌గా సూపర్బ్‌ అనిపించేలా తనదైన మార్క్‌ నటనతో మెప్పించింది. కానీ షారుక్‌ ఖాన్‌తో ఆమె జోడీ అంతగా హైలెట్‌ కాలేదు. విక్రమ్‌ రాథోడ్‌కు భార్యగా దీపికా పదుకోన్‌ కొంత సమయం పాటు కనిపించినా సినిమాకు ప్లస్‌ అయ్యేలా మెప్పిస్తుంది.  

ఇక సెకండాఫ్‌లో కాళీ గైక్వాడ్‌గా విజయ్‌ సేతుపతి హవా ఎక్కువగా ఉంటుంది. జవాన్‌ అతనికి బాలీవుడ్‌లో రెండో సినిమా... ఈ సినిమాతో ఆయనకు అక్కడ మార్కెట్‌ పెరగడం ఖాయం. సినిమాలో విలన్‌ రోల్‌తో పాటు అక్కడక్కడ మంచి కామెడీ పంచ్‌లు కూడా ఆయన నుంచి ఉంటాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. చివర్లో సంజయ్‌ దత్‌ కామియో రోల్‌లో కనిపించి మెప్పిస్తాడు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం డైరెక్టర్‌ అట్లీ స్క్రీన్‌ప్లే అని చెప్పవచ్చు కథ పాతదే అయినా తను రాసుకున్న కథ తీరు ఆడియన్స్‌ను ఎక్కడా బోర్‌ కొట్టిన ఫీల్‌ ఉండదు. విజువల్స్‌తో పాటు భారీ యాక్షన్ సీన్స్‌ హై రేంజ్‌లో ఉంటాయి. ఇందులో అనిరుధ్‌ అందించిన మ్యూజిక్‌ అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. యాక్షన్‌ సీన్స్‌ వరకు బాగున్నా ... హీరో ఎలివేషన్‌తో పాటు పలు సీన్స్‌లలో ఆయన నుంచి ఆశించినంత స్థాయిలో మ్యూజిక్‌ ఉండదు.  ప్రతి సన్నివేశం రిచ్‌గా ఉండేలా కెమెరామెన్‌ పనితనం కనిపిస్తుంది. ఎడిటర్‌ పనితీరు కొంతమేరకు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి.

-బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement