
ఒక్కరోజులో వచ్చే స్టార్‌డమ్ ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. కానీ దాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. అందుకు కచ్చా బాదం సింగర్ భూబన్ బద్యాకర్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ కచ్చా బాదమ్ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. పాటలు, ప్రదర్శనలతో బోలెడంత డబ్బు రావడంతో కారు కూడా కొనుక్కున్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్‌కు గురై ఆస్పత్రి పాలయ్యాడు. మరోవైపు అడిగినవారికల్లా అప్పులు ఇచ్చుకుంటూ వెళ్లిపోయాడే కానీ దాన్ని తిరిగి వసూలు చేయలేకపోయాడు.
చివరికి ఉన్నదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. తనకు లోకజ్ఞానం లేకపోవడంతో ఓ కంపెనీ మూడు లక్షలివ్వగానే వాళ్లు చూపించిన పత్రాల మీద సంతకం పెట్టాడు. దీంతో అతడు కచ్చా బాదమ్ పాట మాత్రమే కాదు ఏ పాట యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినా కాపీరైట్ ఇష్యూ వస్తోంది.
ఇన్ని మోసాలు, కష్టాల తర్వాత అద్దె ఇంట్లో బతుకు వెల్లదీస్తున్న భూబన్ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఓ బెంగాలీ సీరియల్‌లో తండ్రి పాత్రకు ఓకే చెప్పాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందట. ఒక్క పాత్రతోనే రూ.40 వేల దాకా సంపాదించిన అతడు మున్ముందు కూడా మంచి అవకాశాలు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment