సోషల్ మీడియా సామాన్యులకు వరమా? శాపమా?
ఒకప్పుడూ ఇలాంటి సోషల్ మీడియాలు లేని ఆ కాలం చాలా ప్రశాంతంగ సాగిపోయింది. ఏ రోజూ..ఏం వింటాం అనే ఉత్కంఠ, టెన్షన్ మాత్రం లేనేలేవు. ఏదైనా బిజినెస్ మంచిగా సాగాలన్న పేపర్ ప్రకటనలతోనే కొంతమంది ప్రముఖులతోనే ప్రచారం చేయించుకోవడం జరిగేది. ఆలస్యమైనా నిలదొక్కుకునే వారు. సజావుగా సాగేది. అది వ్యాపారమనే కాదు, ఓ వ్యక్తి ఉన్నతి, లేదా సృజనాత్మకత గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఆ ఫేమ్ అలా నిలబడేది. ఒకవేళ కాలం కలిసిరాక కష్టాలు ఎదురైనా కొద్దిమందికే తెలిసేది. ఒకవేళ పత్రికల్లో రాసినా పాపం అన్నట్లుగా ఆ వ్యక్తి గురించి చెప్పిచెప్పనట్లుగా చెప్పేవారు. అంతే తప్ప! ఊదరగొట్టి, బెదరగొట్టి పడేసేలా మాత్రం రాసేవారు కాదు. ఇక ఎప్పుడైతే ఇంటర్నెట్ ఓ రేంజ్లో అందరికి సుపరిచితమై ట్విట్టర్, ఇన్‌స్టా, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు హవా నడవడం మొదలైందో..అప్పటి నుంచి అసలైన సమస్య వచ్చిందనాలా? లేక టెక్నాజీతో దూసుకుపోతున్నాం అనలా తెలియని గందరగోళంలా మారిపోయింది స్థితి. ఎందుకిలా చెబుతున్నానంటే..
సెకనులో తెచ్చిపెట్టే స్టార్డమ్..
ఈ సోషల్ మీడియా అసామాన్యుడిని ఓవర్‌నైట్ సెలబ్రెటీని చేసేస్తుంది. ఓ సామాన్య వ్యాపార వేత్తని సెకండ్లలో ఫేమస్ చేసేస్తుంది. దీంతో వారంతా తమ రంగంలో ఓ రేంజ్లో దూసుకుపోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. మధ్యలో ఏదో జరిగి దివాలా తీశాడో ఇక అంతే! ఇక ఆ తర్వాత కూడా వద్దు రా! నన్ను వదిలేయండన్న వినకుండా వెంట పడి వాడి గురించి వీడియో తీసి పెట్టేస్తారు. అంతకుముందు ఏదైతే ఆయా వ్యక్తులకు పాపులారిటీ తెచ్చిపెట్టిందో అదే వాళ్ల కష్టాలకూ, కన్నీళ్లకు కారణమవుతోంది. అలా బలైన వాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఈ టిక్‌టాక్‌లు యూట్యూబ్‌లతో పేరుగాంచిన కచ్చా బాదం సింగర్ నుంచి ఇటీవల వంటలతో పేరు సంపాదించుకున్న కుమారి ఆంటీ వరకు అందరూ ఈ సోషల్ మీడియా బాధితులే అనాలి.
ఎందుకంటే..?
నిజానికి ఈ ఇద్దర్నీ గమనిస్తే అందులో ఒకరు రోడ్డుపై వేరుశనగలు అమ్ముకుంటే మరోకరు పొట్టకూటి కోసం రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుతున్నారు మరొకరు(కుమారీ ఆంటీ). వారిలో ఒకరేమో! ..వేరశనగలు విక్రయించేందుకు పాడిన పాట ఎవరో వీడియో తీసీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యిపోయారు. ఆ ఇమేజ్ అతడి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతను ప్రైవేట్ ఆల్బమ్‌లో పాట పాడే స్థాయికి కూడా వెళ్లిపోయాడు. అయితే అతనికి ఒక్కసారిగా వచ్చిన ఇమేజ్, సంపద నిలుపుకోవడం చేతకాలేదు. మళ్లీ యథాస్థితికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న దాని గురించి కూడా ఈ సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నాం. ఇక్కడొకటి గుర్తించుకోండి కిందపడితే సాయం చేసేందుకు వచ్చే చేతులు కూడా కొన్నే. పైగా ఇది వరకటిలా మనపై వీడియో కాదుకదా మన గోడువినేందుకు కూడా ముందుకు రారు. అతడి పనై పోయింది తెలుసుకునేది ఏముంది అన్నట్లుంటుంది వ్యవహారం.
ఇక వంటలతో ఫేమ్ సంపాదించికున్న సాయి కూమారి ఆంటీ దగ్గరకు వస్తే..ఆమె మాదాపుర్‌లో ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఏ హంగు ఆర్భాటం లేకుండా జస్ట్ ఓ డేరా కింద హోటల్ నడుపుకుంటుండేది. అందరి దగ్గర వెజ నాన్‌వెజ్ ఏవో రెండు మూడు రకాలు ఉంటాయి ఈమె దగ్గర వెజ్‌కి సంబంధించిన నాన్‌వెజ్‌కి సంబంధించిన పలురకాలు ఉండటమేగాక కాస్త రుచిగా కూడా ఉండటంతో అనతి కాలంలో మంచి పేరు వచ్చేసింది ఆమెకు. దీనికీ తోడు ఈ సోషల్ మీడియా కూడా తోడవ్వడంతో ఆమె బిజనెస్ కూడా ఓ రేంజ్లో దూసుకుపోవడం మొదలైంది. మంచి లాభలతో ఓ రేంజ్లో సాగింది. ఆ ప్రాంతమంతా ఆమె హోటల్ కారణంగా జాతరలా మారి ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడే స్థాయికి వచ్చేసింది.
మాములుగానే మన నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక ఇలాంటి వాటి కారణంగా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడితే అధికారులు ఊరుకుంటారా?. అందులోకి సామాన్యుడి మీదకి లాఠీ ఝళిపించడం చాలా తేలిక. ఇంకేముంది నీ హోటల్ కారణంగానే ట్రాఫిక్ ఏర్పడిందంటూ అధికారులు కూమారీ ఆంటీ హోటల్ని కాస్త మూయించేశారు. నా పొట్టమీద కొట్టొద్దు అంటూ కూమారి ఆంటీ పెడబొబ్బలు పెట్టినా వినిపించుకోలేదు అధికారులు. పార్కింగ్‌కి స్థలం ఇచ్చేంత స్థోమత లేదని ఆమె గోడు వెల్లబోయగా, అదంతా మాకు తెలియదు మీ కారణంగానే ఈ సమస్య అంటూ ఆమెపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ రెండు ఘటనలు చూస్తే సోషల్ మీడియా ఫేమే ఆ ఇద్దరికీ కష్టాలు కూడా తెచ్చి పెట్టిందనలా అంటే..ఓ వ్యక్తిలోని టాలెంట్‌ని అందరికీ సుపరిచితం చేసి అతడికో దారి చూపించడం వరకు ఓకే.
ప్రతిక్షణం ఆ వ్యక్తినే ఫోకస్ పెట్టేలా చేస్తే వచ్చే సమస్యలే ఇవి. పైగా ఆయా వ్యక్తుల నేపథ్యాన్ని తెలుసుకుని వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తారు. కనీసం వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనియ్యకుండా బజారున పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్. అక్కడితో ఆగకుండా ఆమె ఇంత సంపాదించేస్తుందంటూ అదేపనిగా ఊదరగొట్టేస్తారు. ఆ తర్వాత ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వాళ్లపై దాడి జరిగితే..మళ్లీ ఇది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. అసలేంటిదీ? మనం ఏం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ మాయలోపడి మనుషులమనే విషయమే మర్చిపోతున్నామా!. లేక అవతల వాళ్ల జీవితాలను ట్రెండ్ చేసి సొమ్ము చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి.
ఒక విద్యార్థి ఫెయిలైతేనే ఆ మాష్టారు ఎంతో హుందాగా దగ్గరకు తీసుకుని ఇంకో అవకాశం ఉంది పాసవ్వచ్చు అని ధైర్యంగా చెబుతారు. అందరి ముందు అతడిని నిలబెట్టేసి ఏడిపించరు కదా!. అలాంటిది ఇక్కడ జీవితాలకు సంబంధించినవి నెట్టింట వైరల్ చేస్తున్నాం. వీటిని ట్రెండ్ చేసి ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్. వాళ్లలో ఉండే సృజనాత్మకతను, టాలెంటన్ని పదిమందికి తెలిసేలా చేసేవరకు చాలు. మరీ లోతుగా వెళ్లిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయకండి. ముఖ్యంగా వాస్తవాలేంటో తెలియకుండా కథలు అల్లేయొద్దు.
ఇంతకుమునుపు ఇలాంటి వాటి విషయాల్లో వార్తపత్రికలను, మీడియాను తిట్టిపోసేవారు. కానీ ఇప్పుడవే బెటర్‌గా వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లున్సెర్లు మాత్రం ఎవరు ముందు విషయం షేర్ చేశారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే దిశగా వెనకాముందు చూడకుండా ఏదీపడితే అది పోస్ట్ చేసి జీవితాలు అల్లకల్లోలమయ్యి, నాశనమయ్యేలా చేసేస్తున్నారు. మీలో దాగున్న ఏదో ఒక స్కిల్‌తో సొమ్ము ఆర్జిచండి ఇలా పక్కోళ్ల జీవితాలకు సంబంధించి అన్నింటిని ట్రెండ్ చేసి సోమ్ము చేసుకోకండి. అది ఎవ్వరికీ మంచి కాదు. ముఖ్యంగా టెక్నాలజీని మనకు ప్రయోజనకరంగా చేసుకోకపోయిన పర్లేదు గానీ హాని చేసేలా మాత్రం చెయ్యొద్దు!.
(చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!)