
సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రాబోయే మూడు సినిమాల గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి 2898 AD గురించి తాజాగా ఆయన అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూడు ప్రాజెక్టుల షూటింగ్ వివరాలతో పాటు పలు వివరాలను తెలిపారు. శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 పనులు పూర్తి అయ్యాయని చెప్పిన కమల్.. ఇండియన్ 3 షూటింగ్ కూడా పూర్తి అయిందని షాకిచ్చాడు. ప్రస్తుతం ఇండియన్ 2 విడుదలకు రెడీగా ఉందని చెప్పారు. ఈ సినిమా విడుదల తర్వాత దాని సీక్వెల్ పోస్ట్ ప్రోడక్షన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
కల్కి చిత్రంలో తన పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కమల్ పంచుకున్నాడు. 'కల్కి' సినిమాలో కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటించినట్లు ఆయన రివీల్ చేశారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమం కూడా పూర్తి అయిందని చెప్పారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కొంతమేరకు షాక్ అయ్యారు. ఇకపోతే ఎన్నికల హడావిడి అయ్యాక మణిరత్నం 'థగ్ లైఫ్' చిత్రీకరణ మొదలుపెడతామని కమల్ ప్రకటించారు.
కల్కిలో కమల్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఆయన ప్రకటించగానే ఫ్యాన్స్ కొంతమేరకు నిరాశచెందారు. మరికొందరు మాత్రం డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాలెంట్‌ను గుర్తు చేస్తూ కల్కిలో కమల్ 5నిమిషాలు కనిపించినా తీవ్రమైన ఇంపాక్ట్ ఉండే పాత్రనే డిజైన్ చేసుంటారని నెటిజన్లు చెబుతున్నారు. కమల్ హాసన్ నేరుగా తెలుగు చిత్రంలో నటించి 29 ఏళ్లైంది. ఆయన నేరుగా టాలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం.. ‘శుభ సంకల్పం’ (1995). కానీ చాలా రీమేక్, డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సుమారు రెండేళ్ల క్రితం విక్రమ్‌తో మెప్పించిన కమల్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’లో అతిథి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన ఆ తర్వాత మళ్లీ కల్కితో అతిథి పాత్రలో కనిపించనున్నారు.