తమిళ సినీ నటుడు ధనుష్ తమ కుమారుడని కదిరేశన్, మీనాక్షి అనే వృద్ధ దంపతులు చెప్పుకుని పెద్ద వార్తల్లో నిలిచారు. మదురైకి చెందిన ఈ దంపతులు ధనుష్ తమ కుమారుడని కొన్నేళ్లపాటు చట్టపరంగా పోరాటం చేశారు. అయితే ధనుష్ తండ్రిగా చెప్పుకునే కదిరేశన్ కన్నుమూశారు.
మదురైలోని రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కదిరేశన్ మరణించాడు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. ఈ వృద్ధ దంపతులిద్దరూ మదురైలోని మేలూర్ తాలూకాలో మలంపట్టి గ్రామానికి చెందినవారు. ధనుష్ తమకు పుట్టిన మూడో కుమారుడని వారు చెప్పడం ఆపై సుదీర్ఘ న్యాయపోరాటం చేయడంతో వార్తల్లో నిలిచారు.
ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్‌లను గతంలో వారు కోర్టుకు సమర్పించి ఆపై కేసు వేశారు. ఈ ఆరోపణలపై ధనుష్ తరపు న్యాయవాది స్పందిస్తూ నోటీసులు పంపారు. అనంతరం మధురై మేలూర్ కోర్టులో దంపతులు వేసిన కేసును చెన్నై హైకోర్టు కొట్టివేసింది.
నకిలీ పత్రాలను ఉపయోగించి ధనుష్ తమ కుమారుడే అని వారు చెప్పుకుంటున్నారని మార్చి 14న కోర్టు తీర్పు వెలువరించింది. ధనుష్ తమ కుమారుడే అంటూ ఆ వృద్ధ దంపతులిద్దరూ సుమారు పదేళ్ల పాటు పోరాడారు. చివరకు కోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిరోజుల్లోనే కదిరేశన్ మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment