బిగ్‌ బాస్‌కు షాకిచ్చిన సుదీప్‌.. హౌస్ట్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన | Kiccha Sudeep Exit From Bigg Boss Kannada 11 After | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌కు షాకిచ్చిన సుదీప్‌.. హౌస్ట్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన

Published Mon, Oct 14 2024 2:55 PM | Last Updated on Mon, Oct 14 2024 3:09 PM

Kiccha Sudeep Exit From Bigg Boss Kannada 11 After

బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైంది.  సెప్టెంబర్‌ 29 నుంచి మొదలైన ఈ సీజన్‌లో స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ హోస్ట్‌గా కొనసాగుతున్నారు. అయితే, ఈ సీజన్‌ తర్వాత హోస్ట్‌గా తాను వ్యవహరించలేనని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు.  వాస్తవంగా ఈ సీజన్‌ ప్రారంభానికి ముందే బిగ్‌ బాస్‌ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ షో నిర్వాహకులు సుదీప్‌ ఇంటికి వెళ్లి రిక్వెస్ట్‌ చేయడంతో ఆయన తిరిగి సెట్లో అడుగుపెట్టారు.

బిగ్‌ బాస్‌తో కిచ్చా సుదీప్‌కు పదేళ్ల అనుబంధం ఉంది. కన్నడలో ఈ రియాలిటీ షో ప్రారంభ సమయం నుంచి ఆయనే హోస్ట్‌గా కొనసాగుతున్నారు. కలర్స్‌ ఛానల్‌లో ప్రసారం అయ్యే ఈ షో కోసం చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ సీజన్‌ తర్వాత తాను హోస్ట్‌గా కొనసాగలేనని సోషల్‌మీడియా ద్వారా ఇలా ప్రకటించారు.  'బిగ్‌ బాస్‌ పట్ల ఆదరణ చూపుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ నామీద చూపుతున్న ప్రేమ ఏ రేంజ్‌లో ఉందో ఈ షో కోసం వస్తున్న రేటింగ్‌ చెబుతుంది. మీ ప్రేమకు ఫిదా అవుతున్నాను. 

అయితే, బిగ్‌ బాస్‌తో నా ప్రయాణం ఇప్పటికి పదేళ్లు పూర్తి అయింది. 11వ ఏడాది కూడా కలిసి ప్రయాణం చేస్తున్నా. కానీ, నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఎంతో ఉంది. దీంతో బిగ్‌ బాస్‌తో నా ప్రయాణాన్ని ముగించాల్సిన పరిస్థితి ఉంది. ఇదే నా చివరి సీజన్‌గా ఉండబోతుంది. ఇన్నేళ్లపాటు మీరందరూ నన్ను ఆదరించారు. ప్రస్తుతం నేను తీసుకున్న నిర్ణయాన్ని కూడా గౌరవిస్తారని కోరుకుంటున్నాను. ఈ సీజన్‌ని అత్యుత్తమమైనదిగా ఉండేలా నా వంతు ప్రయత్నం చేస్తా.' అని సుదీప్‌ తెలిపారు.

బిగ్ బాస్ కన్నడతో సుదీప్ అనుబంధం ఒక దశాబ్దం పాటు కొనసాగింది. బిగ్‌ బాస్‌ షోకు ఆయన పేరు పర్యాయపదంగా మారింది. తనదైన స్టైల్లో హోస్టింగ్, చమత్కారమైన వ్యాఖ్యలతో పోటీదారులను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించారు. సుదీప్‌ ముందు ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు ఉండటంతో ఈ షో నుంచి ఆయన తప్పుకుంటున్నారని తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement