
Prakash Raj Second Wife Pony Verma: ఇంతకాలం మూవీ అర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన నటుడు ప్రకాశ్ రాజ్ మళ్లీ పెళ్లి అంటూ హాట్‌టాపిక్‌గా మారాడు. అయితే ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఎవరాని తీరా చూస్తే తన రెండవ భార్య పోనీ వర్మను మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. మంగళవారం వారి 11వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
అంతేగాక ట్వీటర్ ఫొటోలు షేర్ చేస్తూ.. తమ కుమారుడు వేదాంత్ కోరిక మేరకు తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నానంటూ పోనీ వర్మకు రింగు తొడిగిన ఫొటోలను ప్రకాశ్ రాజ్ షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకీ ఆయన రెండో భార్య పోనీ వర్మ ఎవరు, ఆమె ఏం చేస్తుందా? అని నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. అయితే మీరు కూడా ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఓ లుక్కేయండి.
ఇంతకీ ఎవరీ ఈ పోనీ వర్మ..
పోనీ వర్మ... ఆమె హిందీ చిత్రపరిశ్రమకు బాగా సుపరిచితురాలు. తెలుగులో కూడా పని చేసినప్పటికి ఇక్కడి వారికి ఆమె పెద్దగా పరిచయం లేదు. పోనీ వర్మ అసలు పేరు రష్మీ వర్మ. పరిశ్రమలో ఆమె ఓ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. దాదాపు 21 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 2000 సంవత్సంరలో పరిశ్రమలో అడుగుపెట్టిన పోనీ వర్మ కలర్స్ ఛానెల్లో ప్రసారమైన ‘చక్ ధూమ్ ధూమ్’ డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరించారు.
అంతేకాదు పలు డ్యాన్స్ షోలతో పాటు సినిమాల్లో కొరియోగ్రఫర్‌గా కూడా పని చేశారు. అలా హిందీలో ‘టైగర్ జిందా హై, జంజీర్, జిలా ఘజియాబాద్, డర్టీ పిక్చర్, గుజారిష్, యే తేరా ఘర్ యే మేరా ఘర్, ఎ బర్డ్ ఇన్ డేంజర్, ఫిల్హాల్, ముస్కాన్’తో పాటు తెలుగులో ‘బద్రీనాథ్, అలా మొదలైంది’ వంటి తదితర చిత్రాలకు కొరియోగ్రఫి అందించారు ఆమె. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో 24 ఆగస్టు 2010న ప్రకాశ్ రాజ్‌ను మ్యారేజ్ చేసుకున్నారు.
అయితే ప్రకాశ్ రాజ్‌కు ఇది రెండవ పెళ్లి అని తెలిసిందే. 1994లో నటి లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. కాగా 2009లో లలితకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2010లో పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2016 ఫిబ్రవరిలో వేదాంత్ జన్మించాడు. ఇక మంగళవారం (ఆగస్టు 24) ఈ జంట పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు వేదాంత్ వారి పెళ్లి చూడాలని ఉంది అని అడిగాడట.
దీంతో కుమారుడి ముందు పోనీ వర్మకు రింగ్ తొడిగి మళ్లీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ప్రకాశ్ రాజ్. ఇందుకు సంబంధించిన ఫొటోలనే ఆయన తన ట్విటర్‌లో షేర్ చేశాడు. కాగా ప్రకాశ్ రాజ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ఈ సారి మా ఎన్నికల అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు.