దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. అయితే నిధుల కొరత కారణంగా భవన నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే దీన్ని పూర్తి చేయడానికి ప్రస్తుత కార్యవర్గం నడుం బిగించింది. భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రూ.40 కోట్ల వరకూ అవసరం అవుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అందుకోసం నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుంటున్నట్లు సంఘం కార్యదర్శి విశాల్ ఇటీవల తెలిపారు.
కాగా సంఘం నూతన భవన నిర్మాణం కోసం సినీ ప్రముఖులు పలువురు పెద్ద మొత్తంలో నిధిని విరాళంగా అందిస్తున్నారు. నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధిస్టాలిన్ ఇటీవల కోటి రూపాయలను విరాళంగా అందించారు. అదే విధంగా నటుడు, మక్కల్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, నటుడు విజయ్ కూడా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. కాగా ఇటీవల నటుడు శివకార్తికేయన్ రూ. 50 లక్షలు విరాళం అందించారు. కాగా తాజాగా ప్రముఖ నటుడు నెపోలియన్ రూ.కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.
ఈయన 2000 నుంచి 2006 వరకూ నడిగర్ సంఘానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారన్నది గమనార్హం. ఇప్పుడు కోటి రూపాయలను నూతన భవన నిర్మాణానికి విరాళంగా అందించడంతో ఆయనకు సంఘ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా ఇటీవలే నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే.
రాజకీయ జీవితం
నెపోలియన్ తన మామ, డిఎంకె నాయకుడు కెఎన్ నెహ్రూకి సహాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2001లో విల్లివాకం నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2006లో జరిగిన ఎన్నికల్లో మైలాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి అనంతరం 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీగా గెలిచారు. 2009 నుంచి 2013 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. నెపోలియన్ 2014లో డీఎంకే పార్టీకి రాజీనామా చేసి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment