‘‘మనిషికి ధైర్యం అవసరమే కానీ మితి మీరిన ధైర్యం మంచిది కాదు. అలాగే మనకు తెలియకుండానే మనలో భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవించాలి. భయమే మనల్ని సరైన దారిలో ఉంచుతుంది. ఈ విషయాన్నే ‘దేవర’లో గట్టిగా చెప్పాను’’ అని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం తొలిభాగం ‘దేవర:పార్టు 1’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో కొరటాల శివ చెప్పిన విశేషాలు..
⇒ ‘దేవర’ కథను చెప్పినప్పుడు ఎన్టీఆర్‌గారు స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇది పూర్తీగా కల్పిత కథ. ‘దేవర’ కథను ఎన్టీఆర్‌గారితోనే అనుకున్నా. ఈ సినిమాలోని దేవరపాత్రకు మరొకర్ని అనుకున్నాననే వార్తల్లో నిజం లేదు (ఈ చిత్రంలోని తండ్రీకొడుకులు ‘దేవర’, ‘వర’పాత్రలను ఎన్టీఆర్ చేశారు). చెప్పాలంటే... దేవరపాత్రను మించి వరపాత్ర ఉంటుంది. మాస్ హీరోగా ఎన్టీఆర్‌గారి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే ‘దేవర’ కథ రాశాను. ఇక అల్లు అర్జున్‌గారితో నేను అనుకున్న కథ వేరు. ‘దేవర’కు ఆ కథకు ఏమాత్రం సంబంధం లేదు.
⇒పాన్ ఇండియా అనేది నాకు తెలియదు. కానీ ‘దేవర’ పెద్ద కథ. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో మూడు గంటల్లో ‘దేవర’ కథను చెప్పలేమని అర్థమైంది. దాంతో ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పాలనుకున్నాం. ఇదేదో వ్యాపారం కోసమో లేక సంచ లనం కోసమో చేసింది కాదు. ఒక భాగంలో కథ చెప్పలేనప్పుడు రెండు భాగాల్లో చెప్పాలి. అయితే ‘దేవర 3, దేవర 4’ అంటూ ఏమీ లేవు.
⇒ మనిషిలో భయం ఉండాలని ‘దేవర’ సినిమాతో చెప్పాలనుకున్నా. కానీ ఈ భయాన్ని నేను జాన్వీ కపూర్‌లో చూశాను. తన డైలాగ్ పేపర్స్‌ను వారం రోజుల ముందే కావాలని అడిగి మరీ జాన్వీ సాధన చేసేది. తొలి రోజు సెట్స్‌లో జాన్వీ కపూర్ అడుగుపెట్టి డైలాగ్స్ చెప్పగానే ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ అన్నారు.
⇒ఓ సినిమాను ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ చేసే విషయాల్లో రాజమౌళిగారిలా నాకు మంచి ప్రావీణ్యం లేదు. అందుకే ఈ విషయాన్ని నేను నిర్మాతలకే వదిలేస్తాను. దర్శకుడిగా నా పనికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ‘దేవర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం దురదృష్టకరం. టీమ్ అంతా వారి స్పీచ్‌ల స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ఇంతలో అలా జరిగిపోయింది.
చిరంజీవిగారితో నా అనుబంధం ఎప్పుడూ బాగానే ఉంటుంది. మేం చేసిన ‘ఆచార్య’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ‘యూ విల్ బౌన్స్ బ్యాక్ శివ’ అని నాకు మెసేజ్ పంపిన తొలి వ్యక్తి చిరంజీవిగారు. అయితే ఆయన ఓ సందర్భంలో మాట్లాడిన మాటలకు మరో అర్థం వచ్చేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మనం ఒక పరీక్ష సరిగ్గా రాయకపోతే తర్వాతి పరీక్ష బాగా రాయాలనుకుంటాం.
ఇదీ అంతే. ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న (2022) విడుదలైంది. వెంటనే మే 19న (2022) ‘దేవర’ మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేయాలని ఆ పనిలో పడిపోయాను. అయితే ‘దేవర’ షూటింగ్ సముద్రంపై చేయాలి. ఇందుకు ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆలోచించుకుని, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లడానికి నాకు కాస్త ఎక్కువ సమయం పట్టింది.
సోషల్ మీడియా మాధ్యమం నుంచి నేను బయటకు వచ్చాను. మెల్లి మెల్లిగా సోషల్ మీడియా లేకపోతే మనం జీవించలేమా? అన్న ధోరణిలోకి వెళ్లిపోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. నెగిటివిటీ ఉండొచ్చు... కానీ ద్వేషం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది మంచిది కాదు.
Comments
Please login to add a commentAdd a comment