టైటిల్: ఖుషి
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: మురళి జి.
ఎడిటర్: ప్రవీణ్ పూడి
విడుదల తేది: సెప్టెంబర్ 1, 2023
యశోద, శాకుంతలం చిత్రాలతో సమంత, లైగర్‌తో విజయ్ దేవరకొండ, టక్ జగదీష్‌తో శివ నిర్వాణ.. ఈ ముగ్గురు తమ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్స్ అందుకున్నారు. వీరి కెరీర్‌కి అర్జెంట్‌గా ఓ హిట్ అవసరం. అందుకే తమకు అచ్చొచ్చిన ప్రేమ కథను ఎంచుకొని ‘ఖుషి’ చేశారు. ప్రేమ కథలను ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో శివ నిర్వాణ ఎక్స్‌పర్ట్. తన కథకు జంటగా విజయ్, సమంతలను ఎంచుకున్నప్పటి నుంచే ‘ఖుషి’పై హైప్ క్రియేట్ అయింది. పాటలు సూపర్ హిట్ కావడం, ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలతో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు(సెప్టెంబర్ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
‘ఖుషి’ కథేంటంటే..
లెనిన్ సత్యం(సచిన్ ఖేడేకర్) ఓ నాస్తికుడు. సైన్స్‌ని నమ్మాలని, మూఢ నమ్మకాలతో మోసం పోవద్దని ప్రచారం చేస్తుంటాడు. దేవుళ్లను నమ్మడు. అతని భార్య రాజ్యలక్ష్మీ(శరణ్య) మాత్రం భర్తకు తెలియకుండా పూజలు చేస్తుంటుంది. ఇక అతని చిన్న కొడుకు విప్లవ్ దేవరకొండ(విజయ్ దేవరకొండ) కూడా నాస్తికుడే. బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావడంతో అడిగి మరి కశ్మీర్‌లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడ ఆరా బేగం(సమంత)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తాను పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం అమ్మాయి అని తెలిసినా.. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.
విప్లవ్ తనపై చూపించే ప్రేమకు ఆరా బేగం ఫిదా అవుతుంది. అప్పుడు తాను ముస్లిం అమ్మాయిని కాదని, బ్రాహ్మిన్ అమ్మాయిని అని, తన అసలు పేరు ఆరాధ్య అని చెబుతుంది. కాకినాడకు చెందిన ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు(మురళీ శర్మ) తన తండ్రి అని చెబుతుంది. చదరంగం శ్రీనివాసరావుకు, లెనిన్ సత్యంకు అసలు పడదు. ఒకరు దేవుడి, జోతిష్యాన్ని నమ్మితే.. మరొకరు సైన్స్, టెక్నాలజీని నమ్ముతారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోరు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు విప్లవ్, ఆరాధ్య. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి? ఇరు కుటుంబాల పెద్దలు ఊహించినట్లు వీరిద్దరు విడిపోయారా? లేదా కలిసే ఉన్నారా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
భార్యభర్తల మధ్య గొడవలు సహజం. ఏదో ఒక సందర్భంలో ఆలుమగల మధ్య కలహాలు వస్తూనే ఉంటాయి. వాటిని భరిస్తూ, ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగడమే జీవితం అని చాటి చెప్పిన సినిమా ‘ఖుషి’. అంతేకాదు మరో సున్నితమైన అంశాన్ని కూడా ఇందులో చూపించారు. రక్తం పంచుకుపుట్టిన పిల్లలు, ఫ్యామిలీ కంటే సిద్దాంతాలు, శాస్త్రాలు పెద్ద గొప్పవి ఏమి కాదని తెలియజేసే బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఇది.
కథగా చూసుకుంటే ఖుషి కొత్తదేమి కాదు. వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం.. పేరెంట్స్‌ని ఎదురించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం..ఈ కాన్సెఫ్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ‘ఖుషి’ కథ కూడా ఇంచుమించు అలాంటిదే. కానీ కథనం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.
నిన్నుకోరి, మజిలి చిత్రాల్లో లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి బాధను చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. ఈ చిత్రంలో పెద్దలను ఎదురించి, ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య ఎలాంటి విషయాలు అపార్థాలకు కారణమవుతుంటాయి? భిన్న నేపథ్యం ఉన్న కుటుంబాలను నుంచి వచ్చినవారికి ఆ అపార్థాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది చూపించాడు. ఫస్టాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ చూపిస్తే.. సెకండాఫ్‌లో వైవాహిక జీవితాన్ని చూపించాడు.
లెనిన్ సత్యం పాత్రను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరో కశ్మీర్‌కి వెళ్లి, హీరోయిన్‌ని చూసేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే బేగం ప్రేమలో విప్లవ్ పడతాడో.. అప్పటి నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. బేగం ప్రేమను పొందేందుకు విప్లవ్ చేసే కొన్ని పనులు నవ్వులు పూయిస్తాయి. వెన్నెల కిశోర్, విజయ్‌ల మధ్య సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయి.
హీరోకి అసలు విషయం తెలియడం.. పెళ్లి కోసం ఇరు కుటుంబాలను ఒప్పించడం..ఇదంతా రొటీన్‌గా సాగుతుంది. పెళ్లి తర్వాత వచ్చే రొమాంటిక్ సాంగ్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత కథనం ఎలా సాగుతుందో ఓ అంచనాకు రావొచ్చు. అయినా కూడా సినిమాపై మాత్రం ఆసక్తి తగ్గదు. సెకండాఫ్‌లో కామెడీ మరింత పండించే స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు.
టెస్టుల కోసం హీరో ఆస్పత్రికి వెళ్లే సీన్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. ఇక చివరి 30 నిమిషాలు అయితే కథ ఎమోషనల్‌గా సాగుతుంది. సైన్స్, శాస్త్రాల కంటే ప్రేమ గొప్పదని చూపించడానికి దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలను అతి సున్నితంగా తెరపై చూపించాడు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. కథ, కథనం కొత్తగా లేకున్నా... ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే సన్నివేశాలు మాత్రం చాలానే ఉన్నాయి. వినసొంపైన పాటలు... అందమైన లొకేషన్స్, విజులవ్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేశాయి.
ఎవరెలా చేశారంటే..
విప్లవ్ దేవరకొండ, ఆరాధ్య పాత్రల్లో విజయ్, సమంత జీవించేశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. విజయ్ గత సినిమాల్లోని షేడ్స్ ఏవి ఇందులో కనిపించవు. పక్కింటి అబ్బాయిలాగా, లవర్‌బాయ్‌గా తెరపై చాలా అందంగా విజయ్ కనిపిస్తాడు. ఫస్టాఫ్‌లో వచ్చీరానీ హింది భాషలో అతను చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక సమంత కూడా గత సినిమాల మాదిరే తన పాత్రలో ఒదిగిపోయింది. చిన్మయి డబ్బింగ్ తన పాత్రకు మరింత వన్నె తెచ్చింది.
హీరో తండ్రి, నాస్తికుడు లెనిన్ సత్యంగా సచిన్ ఖేడేకర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావుగా మురళీ శర్మ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఫస్టాఫ్‌లో వెన్నెల కిశోర్ కామెడీ బాగా పండింది. జయరాం, రోహిణి, రాహుల్ రామకృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తెరపై కూడా పాటలు వినసొంపుగా, అందగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. మురళీ జి. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ. కశ్మీర్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రతి సన్నివేశం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment