తమిళసినిమా: ఎంజీఆర్ మనవడు జూనియర్ ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇరుంబన్. నటి ఐశ్వర్య దత్తా నాయకిగా నటించిన ఇందులో నటుడు యోగిబాబు, సెండ్రాయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కీరా దర్శకత్వంలో తమిళ్ బాలా, ఆర్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక కేకేనగర్‌లోని శాంతి మెట్రిక్యులేషన్ స్కూల్‌లో నిర్వహించారు.
ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ చిత్ర ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరంభ దశలో నటుడు విజయ్‌కు ఆయన తండ్రి దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ సపోర్ట్ చేశారని, అయితే విజయ్ సూపర్‌స్టార్‌గా ఎదగడానికి ఆయన కఠిన శ్రమే కారణమన్నారు. ఇప్పుడు డాన్స్‌లో ఇండియాలోనే విజయ్‌ను మించిన వారు లేరన్నారు.
నటుడు ధనుష్‌కు కూడా మొదట్లో ఆయన తండ్రి అండగా ఉన్నారని, తన ప్రతిభతోనే అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీఆర్ మనవడిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న జూనియన్ ఎంజీఆర్ కూడా కష్టపడితేనే తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇరుంబన్ చిత్ర పాటలు, ట్రైలర్ బాగున్నాయని సీమాన్ అన్నారు. చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment