ప్రముఖ నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో కస్తూరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ముందస్తు బెయిల్ నిరాకరణ..
ఈ కేసులో నటి కస్తూరి ఇప్పటికే మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
క్షమాపణలు చెప్పిన కస్తూరి
అయితే తన వ్యాఖ్యల పట్ల నటి కస్తూరి క్షమాపణలు చెప్పింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆరోపించింది. అయినప్పటికీ కస్తూరి వ్యాఖ్యలపై చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
ఇంటికెళ్లిన పోలీసులు..
ఆమె కేసులు నమోదు చేసిన పోలీసులు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్‌ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..
హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి తెలుగువారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment