కనీ కుశ్రుతి.. మలయాళ నటి. కానీ వెబ్ సిరీస్‌ల వల్ల దేశవ్యాప్తంగా వెండితెర, వెబ్‌తెర అభిమానులకు పరిచయమైంది. నటనలోనే కాదు అసలు ఆమె పెరిగిన విధానంలోనే ప్రత్యేకత ఉంది. కనీ కుశ్రుతి సొంతూరు తిరువనంతపురం. తల్లిదండ్రులు.. జయశ్రీ ఏకే, మైత్రేయ మైత్రేయన్. ఇద్దరూ హేతువాదులు, సామాజిక కార్యకర్తలు. కులాన్ని సూచించే ఇంటిపేరును తొలగించుకున్నారు.
ఇంటి పేరు లేదు
తమ కూతురుకీ ఇంటిపేరునివ్వలేదు. ఈ పెంపకం బయట సమాజానికి చిత్రంగా ఉండటంతో స్కూల్లో.. తోటి వాళ్ల మధ్య ఎన్నో హేళనలకు గురైంది కనీ. అయినా తమ తీరును మార్చుకోలేదు ఆమె తల్లిదండ్రులు. ఏటికి ఎదురీదే ధైర్యాన్ని నూరిపోశారు కూతురికి. అమ్మానాన్న పెట్టిన తొలిపేరే అసలు పేరని.. కులాన్ని సూచించే తోక పేరు అవసరంలేదని చెప్పి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద కనీకి చిన్నప్పుడే అవగాహన కల్పించారు. కానీ టెన్త్ క్లాస్‌లో చివరి పేరు కచ్చితంగా కావాల్సి వచ్చింది కనీకి. అప్పుడు తెలుసుకుంది ఆమె తమ చివరిపేరు కుశ్రుతి(ఆకతాయి, అల్లరచిల్లర అని తెలుగు అర్థం) అని!
సర్కారు బడిలో
కాన్వెంట్ స్కూల్‌కి పంపే ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ కనీ తల్లిదండ్రులు ఆమెను సర్కారు బడిలోనే చదివించారు. స్కూల్లో ఉన్నప్పుడు వర్క్‌షాప్ కోసం ఒక మోడర్న్ స్కూల్‌కి వెళ్లిందట కనీ. ఆ స్కూల్.. అందులోని క్లాస్ రూమ్స్ చూసి ఆశ్చర్యపోయిందట. ఆ స్కూల్‌తో తమ బడిని పోల్చుకుని ‘నన్నెందుకు అలాంటి స్కూల్లో చేర్పించలేదు’ అని అమ్మానాన్నలను అడిగిందట. ‘సామాన్యులు సర్కారు బడికే వెళ్తారు. నువ్వూ సామాన్యురాలివే. ఇక్కడి నుంచే ప్రపంచాన్ని చదవాలి’ అని చెప్పారట. అన్నట్టుగానే ఆ బడి తనకు ప్రపంచాన్ని చూడ్డం నేర్పింది అంటుంది కనీ. పారిస్‌లో థియేటర్ ఆర్ట్స్ చదివింది.
వేధింపుల వల్ల సినిమాలకు దూరం!
2000 సంవత్సరంలో అభినయ థియేటర్ రీసెర్చ్ సెంటర్‌లో చేరి.. 2006 వరకు ఆ గ్రూప్‌తోనే ఉంది. ఆమె ప్రతిభకు ముచ్చటపడిన మలయాళ ఫిలిం ఇండస్ట్రీ .. ‘మనుష్యపుత్రి’ మూవీతో ఆమెకు వెల్‌కమ్ చెప్పింది. ఆ తర్వాత ‘కేరళ కేఫ్’ లోనూ నటించింది. గుర్తింపు వచ్చింది మాత్రం ‘బిర్యానీ’ చిత్రంతోనే. అయితే సినీపరిశ్రమలో తనకెదురైన లైంగిక వేధింపులను భరించలేక ఒకానొక దశలో సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుని కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. మంచి పాత్రలు రావడంతో మళ్లీ సినిమాలు చేస్తోంది.
చదవండి: రెండు ఓటీటీల్లో హనుమాన్.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో!
Comments
Please login to add a commentAdd a comment