ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ ఎలా ఉంది? మీలో చాలామందిని ఈ ప్రశ్న అడిగితే.. బాగానే ఉంది కానీ..? అని అక్కడే ఆగిపోతారు. ఇంకాస్త బాగా తీసుంటే బాగుండేది కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రామాయణం ఆధారంగా తీసిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. అలానే మన ప్రభాస్ హీరోగా నటించడంతో చాలామంది ఈ మూవీ హిట్ అవ్వాలని బలంగా కోరుకున్నారు. రియాలిటీలో జరిగింది, జరుగుతున్నది ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు 'ఆదిపురుష్' విషయంలో ఇలా అనుకోవడానికి కారణాలేంటి?
ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఒప్పుకొన్న మూవీస్ లో 'ఆదిపురుష్' కాస్త స్పెషల్. ఎందుకంటే ఇందులో డార్లింగ్ హీరో.. శ్రీరాముడిగా నటించాడు. ఇప్పటివరకు మనకు రాముడు అంటే నీలమేఘ శ్యాముడిగానే తెలుసు. కానీ 'ఆదిపురుష్' రాముడికి మీసాలు పెట్టడం, సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడం.. ఫ్యాన్స్ కి నచ్చుండొచ్చేమో గానీ రాముడి భక్తులకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ప్రశాంత చిత్తమైన రాముడిని.. బలపరాక్రమశాలిగా చూపించడం కూడా కాస్త వింతగా అనిపించింది.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ సరికొత్త రికార్డు.. దేశంలో ఫస్ట్ హీరోగా!)
డైరెక్టర్ ఓం రౌత్.. రామాయణాన్ని అలానే తీసుంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ 'ఆదిపురుష్' చూస్తుంటే అసలు రామాయణం పూర్తిగా చదివే తీశాడా అనే డౌట్ వచ్చింది. కొన్ని సన్నివేశాల‍్లో మనకు తెలిసినది ఒకటైతే.. ఇందులో చూపించింది మరోలా ఉంది. ఇక గ్రాఫిక్స్ విషయంలో ఓం రౌత్ ఆలోచన ఏంటనేది ఇప్పుడు సగటు రాముని భక్తులకు అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది.
మనకు తెలిసిన రామాయణం ప్రకారం.. సీతను రావణుడు ఎత్తుకెళ్లిపోతే జఠాయు పక్షి రాముడికి ఈ విషయం చెబుతుంది. 'ఆదిపురుష్'లో మాత్రం రాముడు, లక్ష‍్మణుడు స్వయంగా చూస్తారు. చివర్లో బాణంతో రావణాసురుడిని చంపే రాముడు.. సీతని ఎత్తుకెళ్తుంటే ఏం చేయలేకపోతాడు. ఇది ఓ విధంగా రామాయణాన్ని వక్రీకరించడం కిందకే వస్తుంది. అలానే హాలీవుడ్ మూవీల్లో కార్టూన్స్ లాంటివి 'ఆదిపురుష్'లో చాలా చోట్ల కనిపిస్తాయి. పిల్లలకు అవి నచ్చొచ్చేమో గానీ పెద్దోళ్లకు రామాయణం గురించి తెలిసిన వాళ్లకు మాత్రం షాకింగ్ గా అనిపిస్తుంది.
మనకు తెలిసినంతవరకు రావణాసురుడు.. సీతని ఎత్తుకెళ్లడం తప్పితే చాలావరకు సౌమ్యంగానే ఉంటాడు. 'ఆదిపురుష్' లో మాత్రం కరుడుగట్టిన విలన్ లా కనిపిస్తాడు. అనకొండలతో మాసాజ్ చేయించుకోవడం మరీ విడ్డూరం. శివభక్తుడిగా మనందరికీ తెలిసిన రావణాసురుడు.. ఇందులో దాదాపు 90 శాతం సీన్లలో నామాలు లేకుండానే కనిపిస్తాడు. అలానే సినిమాలో ఎవరికీ కూడా ఒరిజినల్ పేర్లు పెట్టలేదు. దీనికి రీజన్ ఏంటనేది అంతుచిక్కని ప్రశ్న. ఇదంతా పక్కనబెడితే సినిమాలోని మంచి మంచి సీన్స్ చాలావరకు సగంలోనే కట్ అయిపోతుంటాయ్. ఇలా 'ఆదిపురుష్' విషయంలో పలు పొరపాట్లు జరగడం.. సగటు సినీ ప్రేక్షకుడికి బాధ కలిగించాయనే చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: జపనీస్‌లో 30 ఏళ్ల క్రితమే 'రామాయణం'.. అప్పట్లోనే 80 కోట్లు!)
Comments
Please login to add a commentAdd a comment