దేవర... వర... ‘దేవర’ చిత్రంలో ఈ రెండుపాత్రల్లో అభిమానులకు రెండింతల ఆనందాన్నిచ్చారు ఎన్టీఆర్. అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేని విధంగా డైలాగ్స్ పలికారు. ఫైట్స్‌లో విజృంభించారు... సాంగ్స్‌లో స్టెప్స్ అదరగొట్టారు... ఎమోషనల్ సీన్స్‌లో మనసును తాకారు. ఇలా మొత్తం మీద ఎన్టీఆర్ మరోసారి నటుడిగా విజృంభించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృçష్ణ .కె నిర్మించిన ‘దేవర’ మంచి వసూళ్లు సాధిస్తూ, దూసుకెళుతోంది. దాంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ విశేషాల్లోకి...
‘దేవర’ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందు ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే గురువారం ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ జరగాల్సి ఉండగా దేవీ నవరాత్రుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌మీట్‌కు అనుమతి లభించలేకపోవడంతో కుదరలేదు. ఇక హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ సెలబ్రేషన్స్‌లో రాజమౌళి, ప్రశాంత్ నీల్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, నాగవంశీ వంటివారితోపాటు పలువురు పంపిణీదారులుపాల్గొన్నారు.
ఆరేళ్లకు సోలోగా...
ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోని సిల్వర్ స్క్రీన్‌పై సోలో హీరోగా చూసింది ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018) తర్వాత ‘దేవర’లోనే. ఈ గ్యాప్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’తో తెరపై కనిపించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ మరో హీరో అని తెలిసిందే. ఇక ఆరేళ్లకు ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం కావడం, దేవర–వరగా రెండుపాత్రల్లో ఎన్టీఆర్ కనిపించడం ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ అయింది.
7 రోజులకు రూ. 400 కోట్లు
‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఎన్టీఆర్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు.. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా...’, ‘దేవర అడిగినాడంటే... సెప్పినాడని అదే సెప్పినాడంటే...’ అంటూ విడుదలైన డైలాగ్స్, ‘చుట్టమల్లె...’పాట, దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీకి తెలుగులో తొలి చిత్రం వంటివన్నీ ‘దేవర’ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను ‘దేవర’ చేరుకున్నాడని చెప్పడానికి వసూళ్లు నిదర్శనం. విడుదలైన ఏడు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక పండగ సెలవులు మొదలయ్యాయి కాబట్టి వసూళ్ల దూకుడు ఆగదని ఊహించవచ్చు.
దసరా సెలవులు... ‘దేవర’ దూకుడు
దసరా పండగ సెలవులు మొదలయ్యాయి. సెలవులు,పోటీలో మరో భారీ చిత్రం లేకపోవడం ‘దేవర’కి కలిసొచ్చే విషయం. ఇంకో వారం దాకా వసూళ్ల దూకుడు ఆగదనే అంచనాలు ఉన్నాయి. పైగా అభిమానులను ఖుషీ చేసేలా శుక్రవారం నుంచి ‘దావూదీ...’పాటను కూడా జోడించారు. ‘దేవర’ విడుదలకు కొన్ని రోజులు ముందు విడుదలైన ఈపాటకు మంచి స్పందన లభించింది. కానీ సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే శుక్రవారం నుంచి అన్ని థియేటర్లలో ఈపాట కనిపిస్తోంది.
‘దేవర 2’ ఎప్పుడంటే...
‘దేవర 2’ షూట్‌ను వచ్చే ఏడాది చివర్లో ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. 2026లో ‘దేవర 2’ విడుదలయ్యే చాన్స్ ఉందట. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సినిమా చేస్తారు ఎన్టీఆర్. అలాగే హిందీలో ‘వార్ 2’ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్‌తో చేసే చిత్రం 2026 జనవరిలో విడుదల కానుంది. ఒకవేళ ‘దేవర 2’ కూడా 2026లోనే విడుదలైతే అప్పుడు ఒకే ఏడాదిలో ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించినట్లు అవుతుంది. అదే జరిగితే 2016 (నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) తర్వాత... పదేళ్లకు ఒకే ఏడాది ఎన్టీఆర్ రెండు సినిమాల్లో కనిపించేది 2026లోనే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment