'Oppenheimer' Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ

Published Sat, Jul 22 2023 12:28 PM | Last Updated on Mon, Jul 24 2023 7:05 AM

Oppenheimer Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌:  ఓపెన్‌హైమర్
నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మేట్ డెమన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్, జోష్ హార్ట్ నెట్, కేసీ ఎఫ్లెక్ తదితరులు
నిర్మాత: ఎమ్మా థామస్ ,  క్రిస్టోఫర్ నోలన్ 
దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్ 
సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్
సినిమాటోగ్రఫీ: Hoyte van Hoytema
విడుదల తేది: జులై 21

ది బాట్‌మాన్ బిగిన్స్, ది డార్క్ నైట్ , డన్‌కిర్క్, టెనెట్  వంటి అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్‌ చేసిన  క్రిస్టోఫర్ నోలన్ నుంచి తాజాగా  'ఓపెన్‌హైమర్' చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా జులై 21న విడుదలైంది. ఇది ఒక బయోపిక్. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన అమెరికా శాస్త్రవేత్త 'రాబర్ట్ జె ఓపెన్ హైమర్' జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించాడు డైరెక్టర్‌ క్రిస్టోఫర్ నోలన్. 

ఓపెన్‌హైమర్ కథేంటంటే..
కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో  చదువుకుంటున్న యంగ్‌ ఓపెన్‌హైమర్‌ (సిలియాన్ మర్ఫీ) పరిచయంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అతను న్యూక్లియర్ ఫిజిక్స్ లో పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా క్రమంగా ఎదుగుతుంటాడు. అదే సమయంలో అమెరికా అణు బాంబును తయారు చేసే పనిలో ఉంటుంది. అప్పుడు 1945  రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో శత్రు దేశాలని ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి పరీక్షించాలని 'మాన్‌హాటన్ ప్రాజెక్టు'ను అమెరికా ప్రారంభిస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో మంచి పరిజ్ఞానం ఉన్న సైంటిస్ట్‌గా గుర్తింపు ఉన్న ఓపెన్‌హైమర్‌ను (సిలియాన్ మర్ఫీ) నాయకుడిగా నియమిస్తుంది. అతనికి సహాయంగా లూయిస్ స్ట్రాస్ (రాబర్ట్ డౌనీ జూనియర్)ను భాగస్వామిని చేస్తుంది.

అలా అతను ఫాదర్‌ ఆఫ్‌ ఆటమ్‌ బాంబ్‌గా తన జర్నీ ఎలా మొదలైందో డైరెక్టర్‌ నోలన్‌ అద్భుతంగా చూపించాడు. అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? హిరోషిమా-నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? అనేది ఈ కథలో తెలుపుతాడు నోలన్‌. ఈ దాడి తర్వాత ఓపెన్‌హైమర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపై అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అతనిపై వచ్చిన విమర్శలను ఓపెన్‌ హైమర్ భార్య కెథెరిన్ లేదా కిట్టి (ఎమిలీ బ్లంట్) ఎలా ఎదుర్కొంది? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు తెలిపిన 'సృష్టించింది నేనే.. నాశనం చేసింది నేనే' అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని అణుబాంబు తయారు చేశానని ఓపెన్‌హైమర్‌ ఎందుకు వెల్లడించారు? చివరికి ఓపెన్ హైమర్ రియలైజ్ అయ్యింది ఏంటి ? లాంటి అంశాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి. ఇంటర్వెల్‌ సమయంలో ఒక రొమాన్స్‌ సీన్‌లో భగవద్గీతను చూపిస్తూ వచ్చే సీన్‌ కొంతమేరకు ఇబ్బందిని కలిగిస్తుంది. దీనిని సెన్సార్‌ ఎలా అంగీకరించిందనేది ప్రశ్నార్థకం.

ఎలా ఉందంటే..
హాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటి వరకు 6 ఆస్కార్‌ అవార్డులు, 21 సార్లు అస్కార్‌ నామినేషన్లకు వెళ్లిన టాప్‌ డైరెక్టర్‌. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ సినిమా 3 గంటల 10 నిమిషాల నిడివితో విడుదలైంది. ఇదొక్కటే కొంచెం మైనస్‌ అని చెప్పవచ్చు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ప్రేక్షకులకి అంత సులభంగా అర్థం కావు. ఎందుకంటే అతని స్క్రీన్ ప్లే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ అతను ఎంచుకున్న కాన్సెప్ట్‌ బాగుంటుంది. నిడివి ఎక్కువగానే ఉన్నా అతని ఫ్యాన్స్‌ను మాత్రం నిరాశపరచలేదు. ఈ సినిమాలో ఎలాంటి తికమకలు లేకుండా కథను చాలా నీట్‌గా చెప్పుకుంటూ వెళ్లాడు కాబట్టి అందరికీ కనెక్ట్‌ కావచ్చు.

సినిమా ప్రారంభంలో కొంచెం స్లోగానే కథ రన్‌ అవుతుంది.  ప్రజెంట్, పాస్ట్.. ఇలా నడుస్తూ ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉన్నా ఓపెన్‌ హైమర్ అణుబాంబు తయారీ టీమ్‌లోకి  అడుగుపెట్టిన సమయం నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా ఆసక్తిగా స్టోరీ నడుస్తుంది. అణుబాంబును తయారు చేసిన తరువాత ట్రయల్‌ విజయవంతం కావడం, ఆపై మొదటిసారి హిరోషిమా-నాగసాకిపై ప్రయోగించడం.. దాని వల్ల  కలిగిన విధ్వంసం ఆ శాస్త్రవేత్తను ఎలాంటి మానసిక వేదనకి గురి చేసింది అన్న సన్నివేశాలు బాగా చూపించాడు నోలన్. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్, ఓపెన్‌ హైమర్ మధ్య నడిచే అప్పటి రాజకీయాలే కాకుండా ఆ సమయంలో వారిద్దరి మధ్య వచ్చే సంభాషణల భావోద్వేగాల సీన్లు బాగుంటాయి.  

మానవత్వాన్ని ఒక వెపన్‌లో పెట్టి వినాశనం చేస్తున్నాను అని ఓపెన్ హైమర్ వేదన చెందే సన్నివేశంలో 'సిల్లియన్ మర్ఫీ' ఎంతో ఎమోషనల్‌గా నటించారు. ఫిజిక్స్, న్యూక్లియర్ సైన్స్‌పై ఆసక్తితో పాటు అవగాహన ఉన్న వారు ఈ కథకు బాగా రిలేట్ కాగలుగుతారు. ఈ చిత్రంలోని కొన్ని టెక్నికల్ బ్రిలియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే అణుబాంబు దాడి గురించి ముందే కొంత అవగాహనతో సినిమాకు వెళ్తే తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో సగటు ప్రేక్షకుడిని అంత సమయం పాటు థియేటర్లో కూర్చోబెట్టడం కొంచెం మైనస్‌. మొదట్లో ఒక గంటపాటు సీన్లన్నీ చాలా నెమ్మదిగా ఉంటాయి. దీంతో  అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంతో కనెక్ట్‌ అవుతారని గ్యారెంటీ లేదు.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో  ఓపెన్‌హైమర్‌ పాత్రలో 'సిలియాన్ మర్ఫీ' పర్‌ఫెక్ట్‌గా నటించాడు. మనం సినిమా చూస్తున్నంత సేపు.. అణుబాంబును తయారు చేసిన వ్యక్తి ఆ సమయంలో ఇంతలా మదనపడ్డాడా..? అని తప్పకుండా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని ఓపెన్‌హైమర్‌గా సిలియాన్ మర్ఫీనే  క్యారీ చేశారు. అతనికి భార్యగా నటించిన ఎమిలీ బ్లంట్ పాత్ర సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది. తన భర్త తయారు చేసిన బాంబ్‌ వల్ల కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటిని ఎలా ఎదుర్కొంది? భర్తకు సపోర్ట్‌గా నిలిచిన విధానం ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్‌కు సహాయకుడిగా నటించిన రోల్‌లో 'రాబర్ట్ డౌనీ జూనియర్' మెప్పించాడు. అటామిక్‌ కమిషన్‌ హెడ్‌గా అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

ప్రధానంగా 'మేట్ డెమన్' ఎయిర్‌ఫోర్స్‌ జనరల్‌ పాత్రలో కావాల్సినంత ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. టెక్నికల్‌ పరంగా చూస్తే.. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ టైమ్‌లోని సీన్లను ఈ జనరేషన్‌కు రీచ్‌ అయ్యేవిధంగా చూపించాడు. దీంతో స్క్రీన్‌పై మంచి ప్రజంటేషన్‌ కనిపిస్తుంది. సినిమాలో ఒకపైపు రియాలిటీని చూపిస్తూనే.. మరోవైపు ఆర్టిఫిషియాలిటీని కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో ఎడిటింగ్‌ వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ అని చెప్పవచ్చు. సినిమాలో చాలా మంది రోల్స్‌ కనిపిస్తూ పోతున్నా.. పర్ఫెక్ట్‌ కంటిన్యూటీని ఫాలో అయ్యాడు. క్వాంటమ్‌ ఫిజిక్స్‌ కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను ఎడిట్‌ చేశారు. నోలన్‌ సినిమాలో సౌండ్‌ వర్క్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా అణుబాంబు పేలుడు సమయంలో  వచ్చే సీన్‌   మెప్పిస్తుంది.

ఈ సినిమాకు రియల్‌ బాంబ్‌ ఉపయోగించామని చెప్పారు. అది నిజమో కాదో తెలియదు.  నోలన్‌ ఫ్యాన్‌ అయితే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. ఒకవేళ నార్మల్‌ ఆడియన్‌ అయితే స్టోరీ కొంచెం నిడివి ఎక్కువ ఉందని అనిపించక మానదు, అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా కూడా ఉంటాయి. సినిమా అభిమానులకు మాత్రం మంచి అనుభూతి అయితే ఇస్తుంది. ఏదేమైనా ఈసారి హాలీవుడ్‌ నుంచి ఆస్కార్‌ బరిలో ఈ సినిమా కచ్చితంగా ఉండే అవకాశం ఉంది.
- బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement