సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవన ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని, కుటుంబ విలువల్ని చాటి చెప్పే మనోరంజకమైన సకుటుంబ కథాచిత్రం 'పెళ్లి పుస్తకం'. రాజేంద్రప్రసాద్ హీరోగా దివ్యవాణి హీరోయిన్‌గా ప్రముఖ దర్శకులు బాపు తీర్చిదిద్దిన ఓ కుటుంబ కావ్యం. బాపు గీత గీసి, ముళ్లపూడి వెంకటరమణ రాత రాసి, శ్రీకారం చుట్టిన 'పెళ్లి పుస్తకం' 1991 ఏప్రిల్ 1న విడుదలై చరిత్ర సృష్టించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న కృష్ణమూర్తి అంటే రాజేంద్రప్రసాద్ ముంబైలోని ఓ సంస్థలో కళా దర్శకుడుగా పని చేస్తుంటాడు. ఇతని భార్య సత్యభామ అంటే దివ్యవాణి కేరళలో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తుంటుంది. అయితే... తమ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీరిద్దరూ కలిసి ఒకే సంస్థలో ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకుంటారు. అలా ఓ పెద్ద సంస్థలో చేరడం కోసం తాము అవివాహితులమని ఆ సంస్థ యజమాని గుమ్మడికి అబద్ధం చెబుతారు. అక్కడ చేరిన తర్వాత వీరు ఎదుర్కొనే సమస్యలే ఈ చిత్రంలోని ప్రధానాంశం.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)
కడుపుబ్బా నవ్వించిన రచన
కంపెనీ యజమానిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నేనూ... అంటూ మాటమాటని కట్ చేసి వెరైటీ స్లాంగ్‌తో మాట్లాడుతుంటే... గుమ్మడి సంస్థలో పని చేసే ఉద్యోగుల చేత బాబాయిగా పిలిపించుకుంటూ... ఈ సినిమాకు కథను అందించిన రావి కొండలరావు బధిర వార్తలు చదువుతున్నట్లు సైగలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. ఇక గిరి పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ విషయానికొస్తే... గుమ్మడి బావమరిదిగా.. దివ్యవాణిపై మనసు పడి ఆ తర్వాత అక్కతో తన్నులు తినే సన్నివేశాలు లోలోన నవ్వు పుట్టిస్తాయి.
చప్పట్లు కొట్టించిన మాటలు
సెకండ్ హీరోయిన్‌గా వచ్చిన గుమ్మడి కుమార్తె వసుంధర పాత్రలో నటించిన సింధుజా కూడా హీరో రాజేంద్రప్రసాద్ వెంట పడి అతని భార్య దివ్యవాణి అసూయకు కారణమవుతుంది. కానీ సింధుజాది అంతా నటన అని చివరకు తెలుసుకుంటుంది. అలాగే చిత్రంలోని బ్రహ్మచారి గదులకు భామలే అందం, పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం, నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు... ఏడుపుచ్చినప్పుడు నవ్వేవాడే హీరో, అసూయ అసలైన ప్రేమకి ధర్మామీటర్, నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తుంది... లాంటి డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)
ఏ పెళ్లిలోనైనా ఆ పాటే
పాటలైతే చెప్పనక్కరలేదు.. ఆరుద్ర చేతి నుంచి జాలు వారిన 'శ్రీరస్తూ శుభమస్తూ' పాట... అప్పటి వరకు తెలుగు లోగిళ్లలో ఎక్కడ పెళ్లి బాజా మోగినా వినిపించే 'సీతారాముల కళ్యాణం చూతమురా రండి' అంటూ సాగే పాటనే పక్కకు నెట్టేసింది. ఇప్పటికీ తెలుగువారి పెళ్లిళ్లలో ఈ పాటే వినిపిస్తుండడం విశేషం. మామ కేవీ మహాదేవన్ సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టిన ‘అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనస్సులాయో...’, ‘కృష్ణం కలయ సఖి సుందరం...’, ‘పప్పు దప్పళం అన్నం నెయ్యి...’, ‘హాయి హాయి శ్రీరంగ సాయి...’, ‘సరికొత్త చీర ఊహించినాను...’ వంటి పాటలు ప్రేక్షక మహాశయులనే కాదు... సంగీత ప్రియులను కూడా ఓలలాడించాయి. పెళ్లికి అర్థాన్నీ, పరమార్థాన్నీ సున్నితంగా, హృద్యంగా అందంగా, రొమాంటిక్‌గా, అన్నింటినీ మించి హాస్యరసభరితంగా చెప్పిన చిత్రం ఈ ‘పెళ్లి పుస్తకం’.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment