
‘అధర్మాన్ని అణచెయ్యగ యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే... స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే...’ అంటూ మొదలవుతుంది ‘కల్కి’ థీమ్ సాంగ్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది.
ఈ సందర్భంగా ‘థీమ్ ఆఫ్ కల్కి’ పాటను మంగళవారం విడుదల చేశారు. ‘అధర్మాన్ని అణచేయగా..’ అంటూ మొదలై... ‘నిశి తొలిచాడు దీపమై... నిధనం తన ధ్యేయమై... వాయువే వేగమై...కలియుగ స్థితి లయలే కలబోసే కల్కి ఇతడే...’ అనే లిరిక్స్‌తో ‘థీమ్ ఆఫ్ కల్కి’ సాగుతుంది. కాలభైరవ, సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా కాలభైరవ పాడారు.