‘ప్రేమ విమానం’ మూవీ రివ్యూ | Prema Vimanam Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

‘ప్రేమ విమానం’ మూవీ రివ్యూ

Published Thu, Oct 12 2023 1:27 PM | Last Updated on Fri, Oct 13 2023 8:48 AM

Prema Vimanam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ప్రేమ విమానం
నటీనటులు: అనసూయ భరద్వాజ్, సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, 'వెన్నెల' కిశోర్ తదితరులు
నిర్మాణ సంస్థలు: అభిషేక్ పిక్చర్స్, జీ 5 
నిర్మాత: అభిషేక్ నామా 
దర్శకత్వం: సంతోష్ కట్టా  
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సినిమాటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి
విడుదల తేది: అక్టోబర్‌ 12, 2023
ఓటీటీ వేదిక: జీ5

‘ప్రేమ విమానం’ కథేంటంటే..
రాము(దేవాన్ష్‌ నామా), లక్ష్మణ్‌ అలియాస్‌ లచ్చి (అనిరుధ్‌ నామా) చిన్న పిల్లలు. విమానం ఎక్కాలనేది వారిద్దరి కోరిక. తమ కోరికను తండ్రి(రవివర్మ)కి చెబితే..పంటలు పండిన తర్వాత కచ్చితంగా విమానం ఎక్కిస్తా అని మాటిస్తాడు. కొన్నాళ్లకే అప్పుల బాధతో తండ్రి ఉరేసుకొని మరణిస్తాడు. తల్లి శాంతమ్మ(అనసూయ భరద్వాజ్‌) కూలి పనికెళ్తూ పిల్లలను పోషించుకుంటుంది. వాళ్లు మాత్రం విమానం ఎక్కాలనే కోరికతో తల్లికి తెలియకుండా రకరకాలు పనులు చేస్తుంటారు.

కట్‌ చేస్తే.. మణికంఠ అలియాస్‌ మణి(సంగీత్‌ శోభన్‌)కు ఆ ఊరి సర్పంచ్‌ కూతురు అభిత(శాన్వీ మేఘన)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆమెకు కూడా మణిని ప్రేమిస్తుంది. ఆ కారణంగానే మణి ఉర్లోనే ఉంటూ తండ్రి(గోపరాజు రమణ)తో కలిసి కిరాణం కొట్టు రన్‌ చేస్తుంటాడు. అభితకు అమెరికా నుంచి సంబంధం రావడంతో తండ్రి ఆ పనుల్లో బిజీగా ఉంటాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని అభిత..మణితో కలిసి ఊరి నుంచి పారిపోతారు. దుబాయ్‌కి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు.

అందుకోసమే హైదరాబాద్‌ వస్తారు. మరోవైపు విమానం ఎక్కాలనే పిచ్చితో ఇంట్లో తల్లి దాచిన డబ్బును దొంగిలించి రాము, లక్ష్మణ్‌ హైదరాబాద్‌కు వస్తారు. ఎయిర్‌పోర్ట్‌ కోసం వెతుకుతుంటారు. అప్పుడు వారికి ఎదురైన సమస్యలు ఏంటి? రాము, లక్ష్మణ్‌లు.. మణి, అభితలకు ఎలా కలిశారు? విమానం ఎక్కాలనే వారి కోరిక నెరవేరిందా లేదా? ఊర్లో నుంచి కూతురు పారిపోయిన తర్వాత సర్పంచ్‌ ఏం చేశాడు? మణి, అభితలు దుబాయ్‌కి వెళ్లారా లేదా? చివరకు ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. 

ఎలా ఉందంటే.. 
టైటిల్‌కు దగ్గట్టే ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు విమానం స్టోరీ రెండూ ఉంటాయి. విమానం ఎక్కాలనే ఇద్దరి పిల్లల కోరిక.. ప్రేమను దక్కించుకోవాలనే ఓ జంట తపన ఈ చిత్రంలో చూడొచ్చు.  ఓ వైపు పిల్లలు, మ‌రో వైపు ప్రేమ జంట.. ఒకే సమయంలో రెండు డిఫరెంట్‌ కథలను చెబుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో దర్శకుడు కొంతమేర సఫలం అయ్యాడు. ఒకే సమయంలో రెండు డిఫరెంట్‌ సినిమాలు చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమా క్లైమాక్స్‌లో ఈ రెండు కథలను ముడిపెడుతూ అల్లుకున్న సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.  అయితే పిల్లల కథ చూస్తున్నంత సేపు మనకు ఈ మధ్యే వచ్చిన ‘విమానం’సినిమా గుర్తుకొస్తుంది. మణి, అభితల లవ్‌స్టోరీలో కొత్తదనం లేదు కానీ బోర్‌ కొట్టదు. 

విమానం ఎక్కాలనే చిన్న పిల్లల కోరికను తెలుపుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు.  రైతు ఆత్మహత్యతో కథ ఎమోషనల్‌ వైపు టర్న్‌ తీసుకుంటుంది.  డబ్బును చెల్లించేందుకు శాంతమ్మ పడే కష్టాలు భావోద్వేగానికి గురిచేస్తే.. విమానం ఎక్కేందుకు పిల్లలు చేసే పనులు.. స్కూల్‌ టీచర్‌ గోపాల్‌(వెన్నెల కిశోర్‌)ని అడిగే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. మరోవైపు మణి, అభిత లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ అంతా సింపుల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంటుంది. సెకండాఫ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్‌ బాగుంటుంది. కథపై ఆసక్తి వచ్చేలోపు శుభం కార్డు పడుతుంది. 

రెండు వేరు వేరు కథలను బ్యాలెన్స్‌ చేయడంలో సఫలమైన దర్శకుడు..ఎమోషన్స్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా చూపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. సినిమాల్లో గుండెల్ని పిండేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి కానీ వాటిని లైట్‌గా చూపించి వదిలేశాడు. స్క్రిప్ట్‌ విషయంలో ఇంకాస్త ఫోకస్‌ చేసి బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం  మరోలా ఉండేది.

ఎవరెలా చేశారంటే..
ముందుగా ఈ చిత్రంలో రాము, లచ్చి పాత్రల్లో దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ నామాల గురించి చెప్పుకోవాలి. వీరిద్దరికి తొలి సినిమా అయినా చక్కగా నటించారు. ముఖ్యంగా అనిరుధ్‌ డైలాగ్‌ డెలివరీ చాలా బాగుంది. ఇక ఈ మధ్యే ‘మ్యాడ్‌’ చిత్రంతో అలరించిన సంగీత్‌ శోభన్‌.. ఇందులో ప్రేమికుడుగా నటించి మెప్పించాడు. అతని కామెడీ టైమింగ్‌ అదిరిపోయింది. సంగీత్‌కు  జోడీగా శాన్వీ మేఘన తనదైన నటనతో ఆకట్టుకుంది.

తెరపై అందంగా కనిపించింది. శాంతమ్మగా అనసూయ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది.  ఎమోషనల్‌ సీన్లలో అద్భుతంగా నటించింది. వెన్నెల కిశోర్‌, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement