
ప్రేమకు కులమతాలతో పట్టింపు లేదు. అది కేవలం హృదయాల్ని తాకుతుంది. మనసుల్ని ఒక్కటి చేస్తుంది. సమాజం విధించిన కట్టుబాట్లను కాదనుకుని మనసు మాట విని పెళ్లి చేసుకున్నవారికి సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఈ విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటునే ఉన్నానంటోంది హీరోయిన్ ప్రియమణి (Priya Mani Raj). ఈమె 2017లో ప్రియుడు ముస్తఫ రాజ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తనపై ట్రోలింగ్ జరుగుతూనే ఉందని చెప్తోంది.
సంతోషాన్ని పంచుకుందామనుకుంటే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. నేను నా సంతోషకర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాను. అలా నా ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ఓ రోజు సోషల్ మీడియాలో వెల్లడించాను. విచిత్రంగా చాలామందికి మా జంటపై విపరీతమైన అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతడు నన్ను మతం మార్పిడికి ఒత్తిడి తెస్తాడని ఏవేవో ఊహించుకుని మాపై విషం కక్కారు. జనాలు ఎంతదూరం వెళ్లారంటే.. రేపు మాకు పుట్టబోయే పిల్లలు ఐసిస్‌లో చేరతారని కామెంట్లు చేశారు.
ఇప్పటికీ అంతే..
నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని అయినంతమాత్రాన మీ నోటికి ఏదొస్తే అది అనేస్తారా? అసలు సంబంధం లేని వ్యక్తుల్ని కూడా విమర్శిస్తారా? ఆ ట్రోలింగ్ వల్ల రెండు, మూడు రోజులపాటు నేను మనిషిని కాలేకపోయాను. ఇప్పటికీ నా భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తే చాలు.. పదిలో తొమ్మిది కామెంట్లు మతం లేదా కులం గురించే ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రియమణి చివరగా ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మలయాళ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ జన నాయగన్ మూవీ చేస్తోంది. అలాగే ద ఫ్యామిలీ మ్యాన్ 3లో నటిస్తోంది.
చదవండి: OTTలో తెలుగు సినిమా.. నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్
Comments
Please login to add a commentAdd a comment