పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని నిరూపించాడు అల్లు అర్జున్. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి రోజు ఏకంగా రూ.294 కోట్లు రాబట్టి దేశంలోనే మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రెండో రోజు రూ.155 కోట్లు వచ్చాయి. అంటే రెండు రోజుల్లోనే రూ.449 కోట్లు రాబట్టి రికార్డులను రఫ్ఫాడిస్తోంది.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు: బన్నీ
ఈ క్రమంలో పుష్ప 2 యూనిట్ హైదరాబాద్‌లో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మాకు ఎంతో సపోర్ట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి , మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిగారికి, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కళ్యాణ్ బాబాయ్‌కు థాంక్స్ . అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.
మూడేళ్ల తర్వాత వెళ్లా
నేను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లాను. థియేటర్ బయట అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సినిమా చూడకుండానే వెళ్లిపోయాను. అక్కడ రేవతి చనిపోయారని తెలిశాక స్పందించడానికి నాకు సమయం పట్టింది. ఇలా జరిగినందుకు నిజంగా సారీ. ఆ కుటుంబానికి అండగా ఉంటాము అని హామీ ఇచ్చాడు.
నా మనసు కకావికలమైపోయింది
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించిన విషాద ఘటనపై డైరెక్టర్ సుకుమార్ స్పందించాడు. మూడు రోజులుగా నేనసలు సంతోషంగా లేను. మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసినా, ఆరు సంవత్సరాలు కష్టపడి తీసినా ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేను. థియేటర్ వద్ద రేవతి మరణించిన ఘటనతో నా మనసు కకావికలమైపోయింది. ఆమె కుటుంబానికి మేము అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ బాధ నుంచి బయటపడ్డాకే సినిమా కలెక్షన్స్ ప్రకటించాం అని చెప్పాడు.
గర్వంగా ఉంది
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ఎంతో వేగంగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమా.. పుష్ప. ఇలాంటి సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది అని తెలిపాడు. ఈ సమావేశానికి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment