నటనకు వయసుతో పనిలేదు అన్నది మరోసారి రుజువైంది. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన సూపర్ సింగర్స్ పోటీలో విజేతలుగా నిలిచి కప్పు గెలుచుకున్న దంపతులు సెంథిల్, రాజ్యలక్ష్మి. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి గాయకులుగా రాణిస్తున్నారు. కాగా ఇప్పుడు గాయని రాజ్యలక్ష్మి కథానాయకిగా అవతారం ఎత్తారు. ఈమె కథానాయకిగా నటించిన చిత్రం లైసెన్స్. జేఆర్‌జీ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎన్. జీవానందం నిర్మించిన ఈ చిత్రానికి గణపతి బాలమురుగన్ దర్శకత్వం వహించారు.
ఇందులో రాజ్యలక్ష్మితోపాటు నటుడు రాధారవి, ఎన్. జీవానందం, విజయ్ భారత్, పళ.కరుప్పయ్య, గీత కై లాసం, అభి నక్షత్ర తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. కాశీ విశ్వనాథన్ ఛాయాగ్రహణం, బైజు జేకప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, నిర్మాత టి.శివ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
అదేవిధంగా నిర్మాత జీవానందం ప్లస్ టూ క్లాస్‌మెట్స్ అయిన 40 మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. కాగా ఈ వేదికపై కథానాయకగా పరిచయం అవుతున్న గాయని రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 32 ఏళ్ల వయసులో ఇద్దరి పిల్లల తల్లి అయిన తాను కథానాయకగా నటిస్తానని ఊహించలేదన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఫోన్ చేసి లైసెన్స్ చిత్రం కథను చెప్పారన్నారు.
కథ విన్న తర్వాత ఇందులో తాను ఏం చేయాలని అడగ్గా మీరే కథానాయకి అని చెప్పారన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో తాను నటించగలనా అనే సందేహాన్ని వ్యక్తం చేయగా ఈ కథలో ఇతర పాత్రలకు చాయిస్ ఉంది గానీ.. కథానాయకి పాత్రకు మీరు తప్ప వేరే చాయిస్ లేదని దర్శకుడు చెప్పారన్నారు. ఒక మంచి కథా చిత్రంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment