
తమిళసినిమా: దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పాట ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ. పుష్ప చిత్రంలో సమంత డాన్స్ చేసిన ఈ పాటను గాయని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ఈ ఒక్క పాటతోనే ఆమె బహుళ ప్రాచుర్యం పొందారు. ఇంద్రావతి ఎవరో కాదు గాయని మంగ్లీ సోదరి. వీరిది అనంతపురం జిల్లాకు చెందిన బంజారా జాతికి చెందిన కుటుంబం కావడం గమనార్హం. చాలా మధ్యతరగతి కుటుంబానికి చెందిన మంగ్లీ జానపద గీతాలతో ఎదిగి సినీగాయనిగా పాపులర్ అయ్యారు.
తాజాగా పుష్ప చిత్రంతో ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ గాయనిగా తెరంగేట్రం చేశారు. ఈమె ఇప్పుడు పరిచయం కావడం విశేషం. తమిళంలో ఎంజాయ్ అనే చిత్రంలో చెంగు చక్కర కన్ను అనే పాటను ఇంద్రావతి చౌహాన్ పాడారు. పెరువళ్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎల్‌ఎన్‌హెచ్ క్రియేషన్స్ పతాకంపై కె.లక్ష్మీనారాయణన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. గీత రచయిత వివేకా రాసిన ఈ పాటకు కేఎం.రయన్ సంగీతాన్ని అందించారు.
ఈ పాట ఇటీవల విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంజాయ్ చిత్రంతో తమిళ చిత్ర సినిమాలోకి చెంగు చక్కర కన్ను పాటతో పరిచయం కావడం సంతోషంగా ఉందని, ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తున్నాయని గాయని ఇంద్రావతి చౌహాన్ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment