‘సైంధవ్‌’ మూవీ రివ్యూ | Saindhav Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Saindhav Review: ‘సైంధవ్‌’ మూవీ రివ్యూ

Published Sat, Jan 13 2024 12:45 PM | Last Updated on Sun, Jan 14 2024 7:53 PM

Saindhav Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: సైంధవ్‌
నటీనటులు: వెంకటేశ్‌,నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌,  రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: శైలేష్ కొలను 
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌
సినిమాటోగ్రఫీ: ఎస్‌. మణికందన్‌
ఎడిటర్‌: గ్యార్రి బి.హెచ్‌
విడుదల తేది: జనవరి 13, 2024

సైంధవ్‌ కథేంటంటే...
ఈ సినిమా కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్‌ టౌన్‌ చుట్టూ తిరుగుతుంది. అక్కడ డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..లాంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) ఆధ్వర్వంలో ఇదంతా జరుగుతుంది. ఓ సారి విశ్వామిత్రకు 20 వేలమంది యువతతో పాటు గన్స్‌, డ్రగ్స్‌ సరఫరా చేసే డీల్‌ వస్తుంది. ఆ పనిని తన వద్ద పని చేసే మాఫియా లీడర్‌ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి అప్పగిస్తాడు. అతను తన అనుచరురాలు జాస్మిన్(ఆండ్రియా)తో ఈ డీల్‌ సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు.

అదే  సమయంలో ఐదేళ్ల  క్రితం వెళ్లిపోయిన సైంధవ్ కోనేరు అలియాస్‌ సైకో(వెంకటేష్‌) తిరిగి చంద్రప్రస్థ టౌన్‌కి వస్తాడు. అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్‌) అంటే ప్రాణం. చంద్రప్రస్థలో పోర్ట్‌లో పని చేస్తూ కూతురుతో కలిసి జీవిస్తుంటాడు. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్‌)కి సైంధవ్‌ అంటే చాలా ఇష్టం. భర్త (గెటప్‌ శ్రీను) కొట్టడంతో అతనిపై కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది.  ఓ సారి స్కూల్‌లో సడెన్‌గా పడిపోతుంది గాయత్రి.

ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ అనే నరాల వ్యాధి సోకిందని, పాప బతకాలంటే రూ. 17 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్‌ ఇవ్వాలని డాక్టర్లు చెబుతారు.  డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌ను చంపడానికి మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో డీల్‌ కుదుర్చుకుంటాడు సైంధవ్‌. అసలు సైంధవ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? కలిసి బిజినెస్‌ చేస్తున్న విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌లను చంపేందుకు మైఖేల్‌ ఎందుకు ప్రయత్నించాడు?  కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సైంధవ్‌ ఏం చేశాడు? చివరకు కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
‘గతాన్ని పక్కన పెట్టి సామాన్య జీవితం గడుపుతున్న హీరోకి సమస్య రావడం.. మళ్లీ పాత శత్రువులతో యుద్ధం చేయడం.. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌.. భారీ యాక్షన్‌ సీన్‌తో కథను ముగించడం’ ఈ తరహా కాన్సెప్ట్‌తో భాషా మొదలు కొని మొన్నటి జైలర్‌ వరకు చాలా సినిమాలు వచ్చాయి. సైంధవ్‌ కథ కూడా ఇలానే ఉంటుంది. కథలో యాక్షన్‌, సెంటిమెంట్‌, ఎమోషన్‌ అన్నీ ఉన్నా.. ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు శైలేష్ కొల‌ను. కథను బలంగా రాసుకున్నాడు కానీ.. స్క్రీన్‌ప్లేని సరిగా పట్టించుకోలేకపోయాడు. ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేసేలా ఒక్క సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దలేకపోయాడు. 

కొన్ని సన్నివేశాల మధ్య కనెక్షన్‌ కూడా సరిగా లేదు. ఎంత సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నా.. తెరపై చూస్తే కొంతవరకు అయినా నమ్మేలా ఉండాలి. చుట్టూ వందల మంది ఉండడం.. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్‌ ఉన్నా.. హీరో మాత్రం ఓ చిన్న గన్‌తో వాళ్లందరినీ మట్టుపెట్టడం ఏంటి? పైగా ఓ సీన్‌లో హీరోకి బుల్లెట్‌ తాకుతుంది.. అది స్పష్టంగా చూపిస్తారు కూడా..  కాసేపటికి హీరో ఒంటిపై ఆ గాయం కూడా కనిపించదు? ఇదెలా సాధ్యం?

పది నిమిషాల్లో ఇంటికి వచ్చిన విలన్లను ‘లెక్క మారుతుందిరా నా కొడకల్లారా’ అంటూ కొట్టి చంపడమే కాదు ఎక్కడో దూరంలో ఉన్న పోర్ట్‌కి వెళ్లి వాళ్లను సముద్రంలో పడేసి వస్తాడు? ఎంత లెక్క మారినా.. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇలాంటి లాజిక్‌ లెస్‌ సీన్స్‌ చాలానే ఉన్నాయి.  ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. 

డ్రగ్స్‌ డీల్‌.. 20 వేల మంది యువత సరఫరా అంటూ సినిమాను చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫాదర్‌-డాటర్‌ సెంటిమెంట్‌ వైపు సాగుతుంది. అయితే సినిమా ప్రారంభంలోనే సైకో వచ్చాడని విలన్లు భయపడడం చూస్తే.. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  అయితే ఆ స్టోరీని పక్కకి పెట్లి ఫాదర్‌-డాటర్‌ సెంటిమెంట్‌తో ఫస్టాఫ్‌ని నడిపించాడు. డబ్బు కోసం హీరో ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ఫస్టాఫ్‌ పర్వాలేదనిపిస్తుంది.

కానీ సెకండాఫ్‌లో మాత్రం కేవలం యాక్షన్‌ ఎపిసోడ్లపైనే ఎక్కువగా ఫోకస్‌ చేశాడు. అందువల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. పోనీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అయినా ఆసక్తికరంగా ఉంటాయా అంటే.. అదీ లేదు.  కాల్పుల మోతే తప్ప ఏమీ ఉండదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ఇక క్లైమాక్స్‌ ఎలా ఉంటుందో సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. తెరపై కూడా అంత ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. కథ బాగుంది కానీ  స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడుంటే ఫలితం మరోలా ఉండేది. 



ఎవరెలా చేశారంటే.. 
సైంధవ్‌ పాత్రలో ఒదిగిపోయాడు వెంకటేశ్‌. యాక్షన్‌ తో పాటు ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. తెరపై స్టైలిష్‌గా కనిపించాడు. వెంకటేశ్‌ తర్వాత ఈ సినిమాలో బలంగా పండిన పాత్ర నవాజుద్దీన్‌ సిద్ధిఖిది. ఆయన పాత్రను తిర్చిదిద్దిన విధానం బాగుంది. తెలుగు,హిందీని మిక్స్‌ చేస్తూ ఆయన చెప్పే డైలాగ్స్‌ బాగున్నాయి.  మనోగా శ్రద్ధా శ్రీనాథ్‌ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది.  

జాస్మిన్‌గా ఆండ్రియా యాక్షన్‌ సీన్‌ అదరగొట్టేసింది. ఆర్యది కేవలం అతిథి పాత్రే.  ముఖేష్‌ రుషి,  జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. సంతోష్‌ నారాయణన్‌ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement