టైటిల్: 'సరిపోదా శనివారం'
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్‌జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులు
నిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేది: ఆగస్ట్ 29, 2024
కథేంటంటే..
సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా ఆరు రోజులు ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ.. తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ల భరతం పడతాడు. కట్ చేస్తే.. దయానంద్ అలియాస్ దయా(ఎస్‌జే సూర్య) క్రూరమైన పోలిస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు.. సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. దయా చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత(ప్రియాంక అరుల్ మోహన్). తన పైఅధికారి కావడంతో అతన్ని ఏమి చేయలేక.. సోకులపాలెం ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది.
మరోవైపు సూర్య కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోకులపాలెం ప్రజలను దయా నుంచి విముక్తి కల్పించేందుకు సూర్య, చారులత కలిసి వేసిన ప్లాన్ ఏంటి? శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య.. క్రూరమైన సీఐ దయాను ఎలా ఎదిరించాడు? దయాకు సోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు? చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్య మరదలు కల్యాణికి చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు సోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఓ ప్రాంతాన్ని విలన్ పట్టి పీడిస్తుంటాడు. అతను చేసే అన్యాయాలను ఎదిరించి, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి హీరో వస్తాడు. తనకు సంబంధం లేకున్నా.. వారికి అండగా నిలిచి చివరకు విలన్ నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.. ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కథ కూడా ఇదే ఫార్మాట్‌లో ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుండా.. కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కొట్టడం ఈ సినిమా స్పెషల్. అంతకు మించి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్‌లోనే కథ ఏంటో చెప్పి ముందే ఆడియెన్స్ మైండ్ సెట్ చేశారు.
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పేందుకు ప్రయత్నం చేయలేదు కానీ.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్మూలతో పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్‌లో కథనాన్ని నడిపించాడు. మొదలు.. మలుపు... దాగుడు మూతలు.. ముగింపు అంటూ కథను విడదీసి చెప్పాడు. నాని, ఎస్‌జే సూర్యల నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా(174 నిమిషాలు) ఉండడం, ఊహకందేలా కథనం సాగడం ఉండడం సినిమాకు మైనస్.
హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణం సినిమా ప్రారంభంలోనే చూపించి.. ఆడియన్స్ మైండ్‌ని సెట్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు సూర్యకు, మరోవైపు సీఐ దయాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ..వీరిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో మొత్తం నాని-సూర్యల చుట్టే కథనం సాగుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగినా..నాని, సూర్యలు తమ నటనతో బోర్ కొట్టకుండా చేశారు. కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఈ సినిమా ఎంటర్‌టైన్ చేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా ఓ డిఫరెంట్ పాత్ర చేశాడు. వారం మొత్తం ప్రశాంతంగా ఉండి.. ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శించే యువకుడు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రం బాగా పండిన మరో పాత్ర ఎస్‌జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐ దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. సూర్య పాత్రను మలచిన తీరు..అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర గుర్తిండిపోతుంది. ఇక కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక అరుళ్ మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సాయి కుమార్, కార్పెరేటర్ కుర్మానంద్‌గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment