ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఏప్రిల్ 12న ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. మహారాష్ట్రలోని సతారాలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారని డాక్టర్ సోమనాథ్ తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఆయనకు ఆంజియోప్లాస్టీ చేశామని ఆయన పేర్కొన్నారు.
సాయాజి షిండే హృదయంలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆయనకు వైద్యులు ఆంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సాయాజి షిండే కూడా ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. 'అందరికీ నమస్కారం, నేను చాలా బాగున్నాను. నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులు చూపిన అభిమానానికి ఫిదా అవుతున్నాను. మీ అందరూ నాతోనే ఉన్నారు. చింతించాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ అందరి ముందుకు వస్తాను.' అని ఆయన అన్నారు.
సాయాజి షిండే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, అతడు, పోకిరి, లక్ష్మి, ఆట, దుబాయ్ శీను, ఆర్య 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్‌మెన్.. ఇలా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment