సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై సీనియర్ నటి షబనా ఆజ్మీ ఘాటుగా స్పందించారు. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం తరువాత వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్న కంగనాపై షబనా తనదైన శైలిలో విమర్శలకు దిగారు. ప్రధానంగా బాలీవుడ్‌కు తానే స్త్రీవాదాన్ని, జాతీయవాదాన్ని నేర్పించానన్న కంగనా వ్యాఖ్యలపై షబనా స్పందించారు. కంగనా తన సొంత పురాణాన్ని విశ్వసించడం మొదలు పెట్టిందనీ, తన మాయలో తాను బతుకుతోందని విమర్శించారు. ఇకనైనా వీటికి స్వస్తి చెప్పి తన పని తాను చేసుకుంటే మంచిదని కంగనాకు సూచించారు.
అంతేకాదు రోజూ వార్తల హెడ్ లైన్స్ లో లేకపోతే ఆమెకు భయం.. అందుకే ఎపుడూ వార్తల్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు, దారుణమైన ప్రకటనలు చేస్తుందంటూ కంగనాపై మండిపడ్డారు. ఆమె చాలా బాగా నటిస్తుంది...నటనపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదంటూ కంగనాకు షబనా ఆజ్మీ హితవు పలకడం విశేషం. ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘డ్రగ్ మాఫియా’, టెర్రరిస్టుల నుంచి బాలీవుడ్‌ను రక్షించాలన్న కంగనా వ్యాఖ్యలను షబానా తిప్పికొట్టారు. చిత్ర పరిశ్రమకు తన కుండే సమస్యలున్నాయని, కానీ మొత్తం పరిశ్రమను ఒకే గాటన కట్టడం అన్యాయమన్నారు. సామాజికంగా నిబద్ధతతో మాట్లాడేవారు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని షబనా పేర్కొన్నారు. నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్ళించే క్రమంలోనే ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో యాంటి నేషనల్ అంటూ షబనా ఆజ్మీపై విమర్శలు గుప్పించిన కంగనా ఆమె భర్త జావేద్ అక్తర్ పై కూడా ఆరోపణలు చేసింది.
కాగా సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో నెపోటిజం, మాదక ద్రవ్యాలవినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సుశాంత్ ది ఆత్మహత్య కాదు అని నిరూపించలేని రోజు తన పద్మశ్రీ పురస్కారాన్ని వదులుకుంటానని కంగనా గతంలో ప్రకటించారు. అయితే తాజాగా సుశాంత్ ది ఆత్మహత్యే అని వైద్యుల బృందం ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద దుమారమే రేగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment