కొత్త ఏడాది తొలిరోజే వార్తల్లో నిలిచిన బాలీవుడ్ ప్రేమజంట హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ. ఈ జంట దుబాయ్ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వనుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యయి.
మూడు రోజుల పాటు పెళ్లి వేడుక
ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు మెహందీ, సంగీత్, పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో పాల్గొనే అతిథుల కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. ముంబయికి చెందిన వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీకి బాధ్యతలను అప్పగించారు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అతిథులతో పాటు దాదాపు 150 మంది వీవీఐపీల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథుల కోసం 70 లగ్జరీ వాహనాలైన మెర్సిడెస్, జాగ్వార్, బీఎండబ్ల్యూ సిద్ధం చేశారు. అతిథులకు రాజస్థానీ వంటకాలను సిద్ధం చేయనున్నారు.
సూర్యగఢ్ ప్యాలెస్
కియారా- సిద్ధార్థ్ రాయల్ వెడ్డింగ్‌కు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యగఢ్ ప్యాలెస్ డెస్టినేషన్ రాయల్ వెడ్డింగ్స్‌కు నిలయం. అతిథులకు విలాసవంతమైన హోటల్ గదులు, బెడ్‌రూమ్‌లు, పెద్ద తోటలు, ఒక కృత్రిమ సరస్సు, ఒక వ్యాయామశాల, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, విల్లాలు, 2 పెద్ద రెస్టారెంట్‌లు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లో వెడ్డింగ్‌కు ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలల్లో మద్యం లేకుండా ఒక్కరోజు ఖరీదు రూ.1.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అక్టోబరు నుంచి మార్చి వరకైతే రోజుకు దాదాపు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నారు.
రూ.8 నుంచి 10 కోట్ల ఖర్చు
సిద్ధార్థ్- కియారాల వివాహం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ వేడుక ఖర్చు దాదాపు రూ. 6 కోట్లకు పైనే ఉండనుంది. ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ఖర్చులు కలుపితే పెళ్లి ఖర్చు దాదాపు రూ.8 నుంచి 10 కోట్ల వరకు కానుంది. వీరి పెళ్లి బాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన వేడుకల్లో ఒకటిగా నిలవనుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే హీరోయిన్. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment