అందుకే కమల్‌తో శ్రీవిద్య పెళ్లి జరగలేదు: హీరోయిన్‌ వదిన | Srividya Sister in Law Reveals Why Srividya And Kamal Haasan Did Not Get Married | Sakshi
Sakshi News home page

Srividya: కమల్‌, శ్రీవిద్య లవ్‌స్టోరీ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!

Published Thu, Jan 11 2024 5:10 PM | Last Updated on Thu, Jan 11 2024 5:31 PM

Srividya Sister in Law Reveals Why Srividya And Kamal Haasan Did Not Get Married - Sakshi

బాల్యంలోనే సినిమాల్లో అడుగుపెట్టింది శీవిద్య. బాలనటిగా కెరీర్‌ ఆరంభించిన ఆమె అగ్ర హీరోలతో నటించి స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో సహా 500కు పైగా చిత్రాల్లో నటించింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలో కమల్‌ హాసన్‌తో ప్రేమలో పడింది. అప్పటికే అతడు వాణితో ప్రేమలో ఉన్నాడు. తర్వాత కమల్‌- శ్రీవిద్య కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ చివరకు కమల్‌.. వాణినే పెళ్లి చేసుకోవడంతో శ్రీవిద్యది విఫల ప్రేమగానే మిగిలిపోయింది.

శ్రీవిద్య, నేను క్లోజ్‌గా ఉండేవాళ్లం
తాజాగా వీరి ప్రేమ గురించి శ్రీవిద్య సోదరుడి భార్య విజయలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'శ్రీవిద్య, నేను చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. కమల్‌ హాసన్‌ను తను ఎంతగా ప్రేమించిందో నాకు బాగా తెలుసు. నా భర్త శంకర్‌, కమల్‌ చాలా మంచి మిత్రులు. ఓసారి కమల్‌.. శంకర్‌తో శ్రీవిద్యను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పాడు. అయితే ఇంట్లో మాట్లాడాక ఏ విషయం అనేది చెప్తానన్నాడు శంకర్‌.

శ్రీవిద్య తల్లి ఒప్పుకోలేదు
తను ఇంట్లో చెప్పగానే మా అత్తయ్య (శ్రీవిద్య తల్లి) అస్సలు ఒప్పుకోలేదు. ఇద్దరూ ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఈ పెళ్లి జరగదు అని చెప్పేశారు. శ్రీవిద్యకు అప్పుడప్పుడే హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తున్నాయని, ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశ్యమే లేదని తెగేసి చెప్పింది. కమల్‌ కొన్నాళ్లు ఆగుతామన్నాడు. అయినా కుదరదని చెప్పేసింది. శ్రీవిద్య కంటే కమల్‌ ఏడాది చిన్నవాడు కావడం కూడా ఓ సమస్యగా మారింది. కానీ శ్రీవిద్య అతడిని ప్రాణంగా ప్రేమించింది.

అమ్మ మాట కాదనలేకపోయారు
ఎలాగైనా అమ్మను ఒప్పించంటూ తన అన్నయ్యను వేడుకుంది. ఈ విషయంలో అతడికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా తల్లి ఒప్పుకోకపోవడంతో ఏం చేయలేకపోయాడు. కానీ మా అత్తయ్య వైవాహిక జీవితం కూడా సజావుగా సాగలేదు. బహుశా అందుకేనేమో.. పెళ్లనగానే తను అలా స్పందించి ఉండవచ్చు' అని పేర్కొంది శ్రీవిద్య వదిన.

క్యాన్సర్‌తో కన్నుమూత
కాగా కమల్‌ హాసన్‌తో విఫల ప్రేమ తర్వాత శ్రీవిద్య అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జార్జ్‌ థామస్‌ను 1978లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె రెండేళ్లకే అతడికి విడాకులిచ్చేసింది. 2003లో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డ ఈ హీరోయిన్‌ 2006లో కన్నుమూసింది. చనిపోయేముందు ఓ ట్రస్టు స్థాపించిన ఆమె.. తన ఆస్తినంతా పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా వీలునామా రాసింది. అలాగే తన సోదరుడి పిల్లలకు చెరి రూ.5 లక్షలు ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది.

చదవండి: హనుమాన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్‌ ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement