‘నీది యాక్టింగ్‌ కాదురా.. సర్దేస్తున్నావ్‌.. ’అంటూ రానాకు క్లాస్‌ పీకిన సూర్య..! | Surya ET Movie Telugu Pre Release | Sakshi
Sakshi News home page

‘నీది యాక్టింగ్‌ కాదురా.. సర్దేస్తున్నావ్‌.. ’అంటూ రానాకు క్లాస్‌ పీకిన సూర్య..!

Published Fri, Mar 4 2022 5:55 AM | Last Updated on Fri, Mar 4 2022 10:28 AM

 Surya ET Movie Telugu Pre Release - Sakshi

సత్యరాజ్, రానా, పాండిరాజ్, జాన్వీ, సూర్య, ప్రియాంక, బోయపాటి శ్రీను, గోపిచంద్‌ మలినేని

‘‘కరోనా టైమ్‌లో ‘అఖండ’, ‘పుష్ప’, ‘బంగార్రాజు’, ‘భీమ్లా నాయక్‌’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు హిట్‌ చేశారు. మిగతా ఇండస్ట్రీలకు సినిమాలను విడుదల చేయాలనే ఆత్మవిశ్వాసం టాలీవుడ్‌ వల్లే కలిగింది’’ అని సూర్య అన్నారు. సూర్య హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఈటీ’. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. నారాయణ్‌దాస్‌ నారంగ్, డి. సురేష్‌బాబు, ‘దిల్‌’ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అతిథులుగా పాల్గొన్న హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్‌ మలినేని ‘ఈటీ’ బిగ్‌ టికెట్‌ను విడుదల చేశారు.



సూర్య మాట్లాడుతూ – ‘‘ఇటీవల నా ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్‌’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి సినిమాకు హద్దు లేదని నిరూపించారు. ఆ రెండు చిత్రాల్లా ‘ఈటీ’ కూడా స్పెషల్‌ ఫిల్మే. ఇక నా అగరం ఫౌండేషన్‌కు స్ఫూర్తి చిరంజీవిగారు. సినిమాల వల్ల మంచి స్థాయికి వెళ్లిన నేను ఏదో ఒకటి చేయాలని ఈ అగరం ఫౌండేషన్‌ని స్టార్ట్‌ చేశాను. ప్రతి ఒక్కరూ మార్పు తీసుకురాగలరు. మనసు ఏం చెప్పిందో దాన్నే ధైర్యంగా చేయండి. కంఫర్ట్‌ జోన్‌లో ఉంటే ఎదుగుదల ఉండదు. అందుకే కంఫర్ట్‌ జోన్‌లో ఉండకండి’’ అన్నారు.

రానా మాట్లాడుతూ – ‘‘నా సినిమా ఒకటి ఎడిటింగ్‌ రూమ్‌లో చూసిన సూర్యగారు ‘‘నీది యాక్టింగ్‌ కాదురా.. సర్దేస్తున్నావ్‌.. (స్టేజ్‌ పై నవ్వులు)’ అని క్లాస్‌ పీకారు. ఆ క్లాసే నన్ను భల్లాలదేవుడిని చేసింది. డేనియల్‌ శేఖర్‌ని చేసింది (సూర్య మైకు తీసుకుని ఇప్పుడు రానాను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు). ‘ఈటీ’ చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘రజనీకాంత్‌గారి తర్వాత సూర్యని ‘మన’ అని తెలుగు ఆడియన్స్‌ అనుకుంటున్నారు. అలాంటి సూర్యగారు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘

‘సూర్యగారు మాస్‌ ఫిల్మ్‌ చేస్తే షేకే. ఓ యునిక్‌ స్టైల్‌ ఉన్న డైరెక్టర్‌ పాండిరాజ్‌గారు’’ అన్నారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ‘‘హైదరాబాద్‌లో జరిగిన కార్తీ ‘చినబాబు’ సినిమా ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సూర్యగారి పేరు ప్రస్తావనకు రాగానే ఆడియన్స్‌ నుంచి రెస్పాన్స్‌ బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ రెస్పాన్స్‌ చూస్తున్నాను. సూర్యగారు స్ట్రయిట్‌గా తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు పాండిరాజ్‌. ‘‘ప్రేక్షకులు గర్వపడే సినిమాలు చేస్తుంటారు సూర్య. ‘ఈటీ’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

‘‘ప్రతి కథను డిఫరెంట్‌గా సెలెక్ట్‌ చేసుకునే ఇండియన్‌ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన ఏ సినిమా చేసినా అందులో ఓ కొత్తదనం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. ‘‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సినిమాలతో సౌత్‌ ఇండియా సినిమాల పట్ల, ముఖ్యంగా తెలుగు సినిమాల పట్ల ముంబైలో మరింత గౌరవం పెరిగింది. సూర్యగారు చేసిన ‘ఈటీ’ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్‌రాజా. నిర్మాత రాజశేఖర్‌ పాండియన్, కెమెరామేన్‌ రత్నవేలు, నటులు వినయ్‌ రాయ్, మధుసూదన్, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement