
నాతో పాటు నా కుటుంబాన్ని కూడా చంపుతానంటూ ఏకంగా నా ఫోన్ నంబర్‌కు కూడా బెదిరింపు మెసేజ్‌లు పంపించాడు...
తమిళ బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి సనమ్ శెట్టిని చంపుతానంటూ ఓ ఆకతాయి బెదిరింపులకు పాల్పడ్డాడు. అదేపనిగా ఆమెకు మెసేజ్‌లు పంపుతూ వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. "గత కొద్ది నెలలుగా నాకు దారుణమైన మెసేజ్‌లు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో వచ్చే వీటిని నేను పెద్దగా పట్టించుకోలేదు.
కానీ నాతో పాటు నా కుటుంబాన్ని కూడా చంపుతానంటూ ఏకంగా నా ఫోన్ నంబర్‌కు కూడా బెదిరింపు మెసేజ్‌లు పంపించాడో వ్యక్తి. అతడు నా పర్సనల్ విషయాలు కూడా సేకరించినట్లు అనిపించడంతో వెంటనే అప్రమత్తమై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు ఎదురైతే లైట్ తీస్కోకండి, బయటకు చెప్పండి, సాయం తీసుకోండి. ఒకరకంగా అది వేరేవాళ్లకు కూడా సాయం చేసినట్లు అవుతుంది" అని చెప్పుకొచ్చింది.
నటి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రాయ్ జాన్ పాల్‌గా గుర్తించారు. అయితే అతడు ఏ ఉద్దేశ్యంతో ఈ చర్యకు పాల్పడ్డాడు? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇక తనను హతమారుస్తానని బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులకు సనమ్ శెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అలాగే కొద్ది రోజులుగా తనకు ధైర్యం చెప్తూ అండగా నిలబడిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.