అల్లు అర్హ, దర్శన్, సితార
ఆకాశంలో ఉరుము.. మంచి మెరుపుతో తన ఉనికిని చాటుతూ శబ్దం చేస్తుంది. కొత్త జాబ్‌లో మెరవాలనుకునేవాళ్లను, తమ టాలెంట్‌తో సౌండ్ చేసేవాళ్లను ‘థండర్’ (ఉరుము)తో పోల్చుతారు. ఇప్పుడు అలా మెరవడానికి తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మూడో తరం వారసుల ఎంట్రీ షురూ అయింది. ఈ ‘థర్డ్ థండర్’ని చూడటానికి ఆయా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు మహేశ్‌బాబు. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం గౌతమ్ (మహేశ్ కుమారుడు) ఆల్రెడీ ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో చైల్డ్ యాక్టర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్ కుమార్తె సితార కూడా దాదాపు ఎంట్రీ ఇఛ్చినట్లే. మహేశ్ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లోని ‘పెన్నీ..’ లిరికల్ వీడియో సాంగ్‌లో సితార అదిరిపోయే స్టెప్‌లతో అలరించింది. అలాగే కృష్ణ కుమార్తె ప్రియదర్శిని (నటుడు సుదీర్‌బాబు భార్య) కుమారుల్లో చరిత్ మానస్ ‘భలే భలే మగాడివోయ్’, విన్నర్’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించాడు.
(చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం)
సుధీర్ హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందు తోన్న తాజా సినిమాలో చిన్నప్పటి సుదీర్‌లా కనిపిస్తాడు చరిత్. అలాగే రెండో కుమారుడు దర్శన్ ‘సర్కారు వారి పాట’లో మహేశ్‌బాబు చైల్డ్ ఎపిసోడ్స్‌లో జూనియర్ మహేశ్‌గా నటించాడు. కాగా కృష్ణ మరో కుమార్తె పద్మావతి (భర్త జయదేవ్ గల్లా) కుమారుడు అశోక్ గల్లా ఆల్రెడీ ‘హీరో’ చిత్రంతో యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరో కుమార్తె– నటి–దర్శకురాలు మంజుల తనయ జాన్వీ కూడా ‘మనసుకు నచ్చింది’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.
ఇటు ప్రముఖ దివంగత నటులు అల్లు రామలింగయ్య యాక్టింగ్ లెగసీని ఆయన మనవడు అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు (అల్లు రామలింగయ్య కుమారుడు అరవింద్ తెలుగులో అగ్రనిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే). ‘శాకుంతలం’ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. అయితే అల్లు రామలింగయ్య కుటుంబానికి చెందిన నాలుగో తరం అల్లు అర్హ. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శాకుంతలం’లో ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపిస్తుంది అర్హ. మరి.. అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కూడా సినిమాల్లోకి వస్తాడా అనేది చూడాలి.
అభిరామ్
ఇక దివంగత ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమారులు సురేశ్‌బాబు నిర్మాతగా, వెంకటేశ్ హీరోగా హిట్టయ్యారు. సురేశ్ పెద్ద కుమారుడు రానా యాక్టర్‌గా మంచి ఫామ్‌లో ఉండగా, చిన్న కుమారుడు అభిరామ్ కూడా యాక్టింగ్‌నే ఎంచుకున్నాడు. తేజ తెరకెక్కించిన ‘అహింస’ చిత్రం ద్వారా అభిరామ్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
యువ రాజ్‌కుమార్
కన్నడ కంఠీరవ మనవడు ఎంట్రీ
కన్నడంలో కూడా మూడోతరం వారసులు నటన వైపు అడుగులు వేస్తున్నారు. దివంగత ప్రముఖ నటుడు, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవరాలు, కన్నడ యాక్టర్ రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్ ‘నిన్నా సానిహకే’ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఇక రాజ్‌కుమార్ కొడుకు, నటుడు–నిర్మాత రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు యువ రాజ్‌కుమార్ సైతం హీరోగా సై అన్నాడు. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ యువ రాజ్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా నిర్మిస్తోంది.
రజ్‌వీర్ డియోల్, అగస్త్య నంద
హిందీలోనూ..
తెలుగు నుంచి ఇంతమంది వారసులు వస్తుండగా అటు హిందీలో కూడా థర్డ్ జనరేషన్ రెడీ అయింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా నంద కుమారుడు అగస్త్య నంద ఎంట్రీ ఖరారైంది. ఈ బిగ్ బి మనవడు జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ‘ఆర్చీస్’ అనే ఓ వెబ్ షోలో నటిస్తున్నాడు. ఇదే వెబ్ ఫిల్మ్ ద్వారా శ్రీదేవి కుమార్తె ఖుషీ, షారుక్ కుమార్తె సునైనా పరిచయం కానున్నారు. ఇక ప్రముఖ నటుడు ధర్మేంద్ర వారసత్వాన్ని ఆయన కుమారులు సన్నీ. బాబీ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సన్నీ చిన్న కొడుకు రజ్‌వీర్ డియోల్ ఎంట్రీ ఖరారైపోయింది. అవనీష్ బర్జాత్యా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ద్వారా రజ్‌వీర్ పరిచయం అవుతున్నారు. ఇక సన్నీ డియోల్ పెద్ద కుమారుడు అంటే రజ్‌వీర్ డియోల్ సోదరుడు కరణ్ డియోల్ ఆల్రెడీ నటుడిగా కొనసాగుతున్నాడు.
సినిమాల్లోకి ఎంట్రీ కార్డ్ ఈజీ అయినప్పటికీ ఈ వారసులపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను చేరుకుంటే ఫ్యాన్స్‌కి పండగే. వీరే కాదు.. మూడో తరానికి చెందిన మరికొందరు వారసులు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment