వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా వెరవక.. లక్ష్యం వైపు అడుగులు వేశారు. సన్నివేశం ఏదైనా అందుకు తగ్గ వేషం వేసి అందరినీ అలరిస్తున్న వారు కొందరు.. తమదైన కళతో నటీనటుల మోముకు అందాలు అద్దుతూ సంపూర్ణత్వాన్ని తెస్తున్న వారు మరొకరు. చలనచిత్ర రంగంలో రాణిస్తున్న సీమ బిడ్డల గురించి ప్రత్యేక కథనం..
మేకప్ బాద్‌షా..
జమ్మలమడుగు (వైఎస్సార్ కడప): మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన గోవిందపల్లె రోషన్ మహబూబ్‌బాషా సినిమా రంగంలో మేకప్‌మెన్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఇతని సినీరంగ ప్రవేశం ఆసక్తికరంగా సాగింది. బాల్యంలో చదువు వంటబట్టకపోవడంతో మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్న తన మామ గఫూర్ వద్ద పని నేర్చుకుందామని పులివెందుల వెళ్లాడు.
రెండేళ్లపాటు అక్కడ పని నేర్చుకున్నాడు. ఆ సమయంలో పులివెందులకు చెందిన రమణబాబు అనే వ్యక్తి మద్రాసు నుంచి కొందరు సినీ నటులను పిలిపించి పులివెందులలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ సినిమా రంగానికి చెందిన వారిని పరిచయం చేసుకుని వారి వెంట 1983లో మద్రాసు వెళ్లాడు. తొలుత నటుడు రంగనాథ్ వద్ద అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా చేరాడు. రెండేళ్ల తర్వాత ఏఎం రత్నం, విజయశాంతి వద్ద అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశాడు. దేవాలయం, వందేమాతరం, అరుణ కిరణం తదితర సినిమాల్లో విజయశాంతికి మేకప్ వేశారు.
ముత్యాల సుబ్బయ్య ప్రోత్సాహంతో..
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన సినిమాలకు చీఫ్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. అందులో ప్రధానంగా పవన్‌కల్యాణ్‌తో నిర్మించిన గోకులంలో సీత, ఒకేమాట, దీవించండి, మామగారు తదితర సినిమాలకు మేకప్‌మెన్‌గా పనిచేశారు.
బాలకృష్ణతో మహబూబ్‌బాషా.. సుమన్‌కు మేకప్ వేస్తున్న మహబూబ్‌బాషా (ఫైల్)
బాలకృష్ణకు సైతం
బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, పవిత్రప్రేమ, కృష్ణబాబు, ఆదిత్య 369, భైరవద్వీపం, పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరుగబడ్డ తెలుగుబిడ్డ, అఖండ సినిమాలలో అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. నటుడు రంగనాథ్‌తో ప్రారంభించిన మేకప్‌మెన్ ప్రస్థానంలో మొత్తం 250 సినిమాలకు మేకప్‌మెన్‌గా పనిచేశానని మహబూబ్‌బాషా తెలిపాడు. ప్రధానంగా బాలకృష్ణ, చిరంజీవి, సుమన్, విజయశాంతి వంటి ప్రముఖ నటీనటుల వద్ద మేకప్‌మెన్‌గా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెబుతున్నాడు.
పోలీసు పాత్రలో దావూద్
పోలీసు పాత్ర.. దావూద్ ప్రత్యేకత
ప్రొద్దుటూరు: ప్రముఖ హీరోలు నటించిన సినిమాల్లో, అన్ని తెలుగు ఛానళ్లలో వస్తున్న సీరియల్స్‌లో నటిస్తున్న నటుడు దావూద్ ప్రొద్దుటూరుకు చెందిన వాడు. ఈయన ఇప్పటి వరకు సుమారు 60 సినిమాలు, 100కు పైగా సీరియల్‌లలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఖాదర్ హుసేన్ మసీదు వీధికి చెందిన మహమూద్, అఫ్తాబ్‌ల కుమారుడు దావూద్ చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై మక్కువ పెంచుకున్నాడు. 2011లో కడప మదీనా ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ పూర్తి చేశాడు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లి చాలా కాలం ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు.
► 2013లో రిలీజైన చిరంజీవి సినిమా ఖైదీనంబర్ 150లో దుబాయి కూలి పాత్రలో దావూద్ రాణించాడు. ఈ ఏడాది దసరాకు రిలీజ్ కానున్న చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో ఎస్‌ఐ పాత్రలో, హీరో ఆది సాయికుమార్ క్రేజీ ఫెలో సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో, కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమాలో సీఐ పాత్రలో, సుధీర్‌బాబు హీరోగా భవ్యా క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ఎస్‌ఐ పాత్రలో, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న కుమారి శ్రీమతి సినిమాలో బ్యాంకు ఆఫీసర్ పాత్రలో దావూద్ నటించిన సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.
► తాజాగా విడుదలైన విరాట పర్వం సినిమాలో మఫ్టీ పోలీసు పాత్రలో, శేఖర్ సినిమాలో ఎస్‌ఐ పాత్రలో, శ్యాంసింగరాయ్‌లో కానిస్టేబుల్ పాత్రలో, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో బ్రిటిష్ పోలీసు పాత్రలో, రిపబ్లిక్ సినిమాలో రిపోర్టర్‌గా, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో జైలర్‌గా, శ్రీకారం సినిమాలో మేనేజర్‌గా నటించాడు.
► ప్రముఖ తెలుగు ఛానళ్లలో వస్తున్న ఊహలు గుసగుసలాడే, సూర్యకాంతం, జానకి కలగనలేదు, వైదేహి పరిణయం, మౌనపోరాటం తదితర సీరియల్స్‌లో పలు పాత్రలు దావూద్ పోషిస్తున్నాడు.
హీరో, హీరోయిన్లకు సీన్ వివరిస్తున్న డైరెక్టర్, తదితరులు
శభాష్.. మహేష్
పులివెందుల రూరల్: పులివెందుల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చెందిన మహేష్ గాయకుడిగా, నటుడిగా సామాజిక మాధ్యమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. బాబయ్య, ఇమాంబిల కుమారుడు మహేష్. డిప్లొమా పూర్తి చేసిన ఈ యువకుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్ చానెళ్లు, సీరియళ్లలో పాటలు పాడుతూ, నటిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఇతను 25 లఘుచిత్రాలు, 30 సీరియల్స్‌తోపాటు స్పైడర్, నేనే రాజు – నేనే మంత్రి, నేను లోకల్, ద్వారక, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలలో చిన్న పాత్రల్లో నటించినట్లు తెలిపాడు. సినిమా రంగంలో నటుడిగా స్థిరపడాలనేదే నా కోరిక’ అంటున్న ఈ యువ నటుడు మరింతగా రాణించాలనేదే ఈ ప్రాంత వాసుల ఆకాంక్ష.
వారం ప్రవీణ్‌కుమార్
వేణుమాధవ్ మళ్లీ వచ్చాడు!
కడప సిటీ: హాస్యనటుడిగా సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ తనువు చాలించి రెండేళ్లకు పైగా అయింది. అయితే అదే ముఖ కవళికలు, పోలికలతో కడపకు చెందిన వారం ప్రవీణ్‌కుమార్ వేణుమాధవ్‌ను మరిపిస్తున్నాడు. జూనియర్ వేణుమాధవ్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం శాంతకుమార్ దర్శకత్వంలో సాయికుమార్ హీరోగా నిర్మిస్తున్న నాతో నేను అనే సినిమాలో హాస్యనటుడిగా ప్రముఖ నటుడు భద్రం, సాయిశ్రీనివాస్‌ల సరసన నటిస్తున్నాడు. తొలుత టిక్‌టాక్ షోలలో కామెడీ సీన్లు చేసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చాడు. అచ్చం వేణుమాధవ్ లాగే ఉన్నాడని కొన్ని ఛానళ్లు గ్రహించి టీవీ షోలలో కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల కాలంలో మృతి చెందిన సినీ నటులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులతో హైదరాబాదులో ప్రముఖ ఛానల్‌లో షో నిర్వహించారు. ఆ షోలో ప్రవీణ్‌కుమార్ పాల్గొని అచ్చం వేణుమాధవ్‌లా హావభావాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు.
కుటుంబ నేపథ్యం..
కడప విశ్వనాథపురానికి చెందిన వారం సుబ్బరాయుడు, శ్యామలాదేవి దంపతుల రెండో కుమారుడు వారం ప్రవీణ్‌కుమార్. ఇతను ఎంఏ బీఈడీ చదువుకున్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ‘నేను వేణుమాధవ్ పోలికలతో ఉండడం నిజంగా నా అదృష్టమని, దాంతోనే నాకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం దక్కుతోందని’ తెలిపాడు. తన సోదరి, బావ, సతీమణి సహకారంతోనే తాను రాణిస్తున్నాని చెప్పాడు. సినిమాల్లో అవకాశం రావడానికి ఆయన పోలికలు ఉండడమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. కడపకు చెందిన ఈ జూనియర్ వేణుమాధవ్ భవిష్యత్తులో తన నటనా చాతుర్యంతో అందరి మన్ననలు పొందాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment