‘‘హీరోల క్యారెక్టరైజేషన్ చుట్టూ కథలు అల్లడంపై ప్రస్తుతం నాకు ఆసక్తి లేదు. నేను రాసే కథలు హీరో సెంట్రిక్‌గా ఉంటాయి. ఒకవేళ భవిష్యత్తులో పెద్ద హీరోలు అవకాశం ఇస్తే అప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తానేమో. ఇప్పుడైతే ఓ అంశంతో కథను అల్లుకుని పాత్రలను సృష్టించుకుంటున్నాను. సామాజిక అంశాలకు వాణిజ్యపరమైన హంగులు జోడించి కథలు చెప్పడం నాకు ఆసక్తి’’ అన్నారు దర్శకుడు విజయ్ కనకమేడల. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉగ్రం’. ఇందులో మీర్నా మీనన్ హీరోయిన్. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో విజయ్ కనకమేడల చెప్పిన విశేషాలు.
► ‘నాంది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత లాక్‌డౌన్ వల్ల కొంత సమయం దొరికింది. అప్పుడు ‘ఉగ్రం’ కథ రాసుకున్నాను. ప్రతిరోజూ మిస్సింగ్ వార్తలను గమనిస్తూనే ఉన్నాం. తెలంగాణ హైకోర్టు మిస్ అవుతున్న వారు ఏమౌతున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు డిపార్ట్‌మెంట్‌ని కోరినట్లు ఒక ఆర్టికల్ చదివాను. తప్పిపోతున్న వారి కుటుంబ సభ్యుల బాధ ఎలా
ఉంటుందనే అంశంపై కథ చేస్తే బావుంటుందనిపించి, ‘ఉగ్రం’ కధ రెడీ చేశాం. తూము వెంకట్ నా ఫ్రెండ్. కథల గురించి మేం ఇద్దరం ఆలోచిస్తూనే ఉంటాం. మా కో–ఆర్డినేషన్ చాలా బాగుంటుంది. ఐడియాల షేరింగ్ ఎలా ఉన్నా తనది కథ, నాది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ క్రెడిట్ అనుకున్నాం. అలా కొనసాగుతున్నాం.
► ‘ఉగ్రం’ స్క్రిప్ట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంది. కథలో క్యారెక్టరైజేషన్ ప్రకారమే యాక్షన్ సీక్వెన్స్‌లు వస్తాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించడానికి ముందు కొంత రిహార్సల్స్ చేశాం. వీటి వల్ల నరేశ్‌గారి బాడీ లాంగ్వేజ్, ఫిట్‌గా ఉండటం వంటి అంశాలు మరింత మెరుగుపడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ కాలేజ్ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా మూడు భిన్నమైన కోణాల్లో కనిపించాలి. మిర్నా చేసిన గత సినిమాలు చూశాను. ఆడిషన్స్‌కు పిలిచి ఆమెను ఎంపిక చేసుకున్నాం. బాగా యాక్ట్ చేశారు.
► నరేశ్‌గారు ఆల్ రౌండర్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. నా దృష్టిలో ఆయన కామెడీ హీరో కాదు. హీరోగా ఎక్కువగా కామెడీ చిత్రాలు చేశారంతే. ‘ఉగ్రం’లో ఇంటెన్స్, ఎమోషన్స్ ఉన్న పోలీసాఫీసర్‌గా ఆయన బాగా నటించారు. అలాగే ఈ సినిమాలో ఓ లవ్ సాంగ్, ఫ్యామిలీ, టైటిల్ ట్రాక్స్ ఉన్నాయి. అయితే ఈ పాటలు కథను డిస్ట్రబ్ చేయవు. ఈ పాటల్లో కూడా కథ కొనసాగుతుంటుంది.
అప్పుడు ఉగ్రం ఆలోచన వచ్చింది
Published Sun, Apr 30 2023 3:49 AM | Last Updated on Sun, Apr 30 2023 3:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment