సినిమాల్లో ఎవర్ గ్రీన్ జానర్ ఏదైనా ఉందా అంటే చాలామంది చెప్పేమాట థ్రిల్లర్. ఈ జానర్ మూవీస్ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం (అక్టోబర్ 18) థియేటర్లలో రిలీజైన మూవీ 'వీక్షణం', రామ్ కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే)
కథేంటి?
ఆర్విన్ (రామ్ కార్తీక్) ఇంజినీరింగ్ పూర్తి చేసిన కుర్రాడు. ఖాళీగా ఉండేసరికి ఏం చేయాలో తెలీక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు ఏం చేస్తుంటారా అని బైనాక్యులర్‌తో చూస్తుంటాడు. అలా తమ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండే నేహా(కశ్వి)ని చూసి ఇష్టపడతాడు. ఫ్రెండ్స్ సహాయంతో ఆమెతో ప్రేమలో పడతారు. మరోవైపు తన ఎదురింట్లో దిగిన ఓ అమ్మాయి (బిందు నూతక్కి) రోజుకి ఒకరితో రావడం గమనిస్తాడు. వాళ్లని ఆమె దారుణంగా చంపడం చూస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తోంది? దీని వల్ల ఆర్విన్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమా అంటే ఓ టెంప్లేట్ ఉంటుంది. ఓ హంతకుడు ఉంటాడు. మనుషుల్ని చంపేస్తుంటాడు. అతడు/ఆమె అలా చంపడానికి కారణమేంటి? హీరో సదరు హంతుకుడిని ఎలా పట్టించాడు అనే పాయింట్‌తో పలు భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. 'వీక్షణం' కూడా దాదాపు అదే తరహాలో తీసిన మూవీ. కానీ స్టోరీ కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంది.
బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటున్న ఓ అమ్మాయి.. సడన్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లోని కారుపై పడి చనిపోతుంది. ఇలా షాకింగ్ సీన్‌తో మూవీని మొదలవుతుంది. కట్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే హీరో, అతడికో ఇద్దరు ఫ్రెండ్స్. బైనాక్యూలర్లో చూసి తన ఇంటి పక్కనో ఉండే అమ్మాయితో ఇష్టపడటం, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం ఇలా లవ్ ట్రాక్. మరోవైపు తన ఎదురింట్లో రోజుకో వ్యక్తితో ఓ అమ్మాయి రావడం, వాళ్లందరినీ చంపుతుండటం.. ఇలా మరో స్టోరీ నడుస్తుంటుంది. ఇదంతా హీరో చూస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరా అనే విషయం తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
సెకండాఫ్‌లో హత్యలు చేస్తున్న అమ్మాయి ఎవరు? అసలు ఆమె ఎందుకిలా చేస్తోంది? ఆమె లిస్టులో హీరోయిన్ ఎందుకుంది? అనే పాయింట్లని సెకండాఫ్‌లో చూపించారు. ఫస్టాప్ అంతా రొటీన్ లవ్ ట్రాక్ చూపించారు. అదేమంత పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఎప్పుడైతే ఇంటర్వెల్‌లో ట్విస్ట్ పడుతుందో.. సెకండాఫ్‌లో దెయ్యం కథ ఉండబోతుందా అనుకుంటాం. కానీ మనం ఊహించని విధంగా హంతకుడి విషయంలో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఓఆర్‌డీ (ORD) అనే జబ్బు గురించి చెప్పి, చిన్నపాటి మెసేజ్ ఇచ్చారు. అదే టైంలో సీక్వెల్ ఉండే అవకాశముందనేలా మూవీని ముగించారు.
రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలానే తీసినప్పటికీ సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. హంతకుడి విషయంలో మనం ఊహించనది జరుగుతుంది. ఇప్పటికీ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్యని స్టోరీలో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. అది ప్రేక్షకులని ఆలోచింపజేస్తుంది. రెండు గంటల నిడివి కూడా ప్లస్ పాయింట్. కాకపోతే పెద్దన్న పేరు నటులు లేరు. అలానే ఫస్టాప్ అంతా కావాలనే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది తప్పితే ఓవరాల్‌గా మూవీ గుడ్.
ఎవరెలా చేశారు?
ఆర్విన్ అనే కుర్రాడిగా చేసిన రామ్ కార్తిక్ పాత్రకు తగ్గట్లు ఉన్నాడు. ఫస్టాప్ అంత లవర్ బాయ్‌లా, సెకండాఫ్‌లో హత్యలు కనుక్కొనే వాడిలో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. కశ్వి అయితే గ్లామర్ చూపించడానికి తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి అనే అమ్మాయి పర్లేదనిపించింది. సర్‌ప్రైజింగ్ పాత్ర చేనిన నటుడు కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.
టెక్నికల్ విషయానికొస్తే థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‍ని సమర్థ గొల్లపూడి సరిగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. ఇక డైరెక్టర్ మనోజ్ పల్లేటి.. తను అనుకున్న పాయింట్ గురించి బాగానే రీసెర్చ్ చేసి మరీ రాసుకున్నాడు. దాన్ని సినిమాగా తీసి మెప్పించాడు. నిర్మాణ విలువలు కూడా స్థాయిగా తగ్గట్లు ఉన్నాయి. పెద్దగా పేరున్న నటీనటులు లేరు. కాబట్టి ప్రేక్షకులు ఈ మూవీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి?
రేటింగ్: 2.75
-చందు డొంకాన
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కానీ!)
Comments
Please login to add a commentAdd a comment