నూతన దంపతులు నయనతార-విఘ్నేశ్ శివన్‌లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట.. పెళ్లయిన మరుసటి రోజే దంపతులుగా తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో నయనతార చెప్పులతో తిరగడం, శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి అత్యంత సమీపంలోనే వారు ఫొటోషూట్‌లో పాల్గొనడం వివాదస్పదమైంది. శ్రీవారిని దర్శించుకునేందు వచ్చిన ఈ కొత్త జంట భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిండంతో వారిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
అంతేకాదు వీరి తీరుపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై వివరణ ఇస్తూ నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్నట్లు గుర్తించలేదని లేఖలో పేర్కొన్నాడు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం ఉందని, తాము తెలియక చేసిన తప్పులను మన్నించాలని కోరాడు. ‘మాపెళ్లి తిరుమలలో జరగాలని కోరుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. చెన్నైలో మా వివాహం జరిగింది. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో పెళ్లి తరువాత ఇంటికి కూడా వెళ్లకుండా మండపం నుంచి నేరుగా తిరుమలకు వచ్చాము. స్వామి వారి కల్యాణోత్సవం సేవలో పాల్గొని ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం. శుక్రవారం దర్శనం చేసుకునేందుకు వచ్చాము.
దర్శనం అనంతరం మా పెళ్లి తిరుమలలో పూర్తయినట్లు అనిపించేలా ఫోటో తీసుకోవాలని అనుకున్నాము. అయితే ఆలయ ప్రాంగణంలో భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల ఆలయం నుంచి వెళ్ళిపోయాము. మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాము. వెంటనే ఫోటోషూట్ పూర్తి చేయాలనే కంగారులో చూసుకొకుండా చెప్పులు ధరించి రావడం జరిగింది. ఆ సమయంలో కాళ్లకు చెప్పులు ఉన్నట్లు గమనించుకోలేదు. ఇందుకు మనస్ఫూర్తిగా మేమిద్దరం క్షమాపణ కోరుతున్నాం. మాపెళ్లి ఏర్పాట్ల కోసం గత 30 రోజుల్లో ఐదుసార్లు తిరుమలకు రావడం జరిగింది. ఎప్పుడూ ఇలా జరగలేదు. మేము ఎంతగానో ప్రేమించే స్వామి వారిపై భక్తి లేకుండా లేదు. తెలియక జరిగిన మా తప్పులకు మేము క్షమాపణలు చెప్తున్నాము. దయచేసి క్షమించండి’ అని విఘ్నేశ్ తన నోట్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment