'వ్యూహం' సినిమా రివ్యూ | Vyooham Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Vyooham Movie Review: 'వ్యూహం' సినిమా రివ్యూ

Mar 2 2024 2:30 PM | Updated on Mar 2 2024 2:59 PM

Vyooham Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: వ్యూహం
నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు
నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌ కుమార్‌
రచన-దర్శకత్వం: రామ్‌ గోపాల్‌ వర్మ
సంగీతం: ఆనంద్
సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్
విడుదల తేది: మార్చి 2, 2024

రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాస్తవంగా ఈ రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రాన్ని నారా లోకేష్‌ అడ్డుకునే ‍ప్రయత్నం చేయగా ఆ చిక్కులన్ని దాటుకోని నేడు(మార్చి 2) విడుదలైన వర్మ వ్యూహం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు మరణించిన సీన్‌తో వ్యూహం సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని వీర శేఖర్‌ రెడ్డి అని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని మదన్‌ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశారు. వీఎస్సార్‌ మరణానికి ముందు జగన్‌ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్సార్‌ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం జరుగుతుంది.

ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా.. మదన్‌(అజ్మల్‌ అమీర్‌) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్‌ పార్టీ (కాంగ్రెస్‌) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్‌ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్‌ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్‌ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్‌ కళ్యాణ్‌..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? శ్రవణ్‌ కల్యాణ్‌ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్‌ ఎలా ప్రజా నాయ‌కుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే..
వైఎస్సార్‌ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్‌ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్‌ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్‌ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? అప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్‌ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికి ఎలాంటి బెరుకు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకుని అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు.

ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ.. అందుకే వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్‌ అయి ఉంటాడు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది.. ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశాడు.. కష్ట సమయంలో వైఎస్‌ జగన్‌ గారికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది.

కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్‌ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్‌ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్‌గానే జగన్‌ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్‌ కల్యాణ్‌ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూస్తే అందరినీ నవ్వు తెప్పిస్తాయి.

మళ్లీ 2019 నాటికి పవన్‌తో మళ్లీ బాబు టచ్‌లోకి వెళ్లడం వంటి సీన్స్‌ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబుగారు అంటూ పొగడ్తలతో ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్‌ (లోకేష్‌) పాత్ర కనిపించి కనిపించక ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్‌ నుంచి వచ్చే డైలాగ్స్‌ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్లి చూస్తేనే బాగుంటుందని అభిప్రాయం.

ఎవరెలా చేశారంటే..
వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్‌ జగన్‌, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్‌ కల్యాణ్‌ పాత్రకు  కాస్త ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు అని చెప్పవచ్చు.. జగన్‌ గారిలో ఉన్న మ్యానరిజాన్ని పర్‌ఫెక్ట్‌గా అజ్మల్‌ చూపించాడు.. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్స్‌లలో జగన్‌ గారికి దగ్గరగా కనిపిస్తాడు.

ముఖ్యంగా వ్యూహం సినిమాలో వైఎస్‌ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్‌ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే.. ఆయన నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు.. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు.  సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్‌ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది.

వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. వైఎస్‌ జగన్‌ గారి జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్‌ చేసిన తీరు పర్వాలేదు.. ఏదైమనా వ్యూహం సినిమాను ఎవరైనా చూడొచ్చు.. వైఎస్‌ జగన్‌ గారి అభిమానుల్లో మాత్రం ఫుల్‌ జోష్‌ను నింపడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement