WWW Movie Review And Rating In Telugu | WWW Movie Cast, Story - Sakshi
Sakshi News home page

WWW Movie Review: ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ ఎలా ఉందంటే..?

Published Fri, Dec 24 2021 3:00 PM | Last Updated on Fri, Dec 24 2021 3:18 PM

WWW Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు)
న‌టీన‌టులు: అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య, సందీప్‌, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ వైవా హర్ష,తదితరులు 
స‌మ‌ర్ఫ‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాణ సంస్థ: రామంత్ర క్రియేషన్స్
నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల
దర్శకత్వం: కె వి గుహన్
సంగీతం: సైమన్‌ కె. కింగ్
ఎడిటింగ్‌: తమ్మిరాజు
విడుద‌ల తేది: డిసెంబర్‌ 24, 2021(సోనిలీవ్‌)

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా  రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్ల‌ర్ మూవీ ‌'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌రు 24న సోనిలీవ్‌లో విడుదలైంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌,ట్రైల‌ర్, పాట‌లు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. తెలుగులో వ‌స్తున్న ఫ‌స్ట్ కంప్యూట‌ర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావ‌డం, డి. సురేష్ బాబు, దిల్‌రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాకు స‌పోర్ట్ చేయ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. భారీ అంచనాల మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..?
విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), సదా సత్యం రాజేష్), చిష్ట్రీ(దివ్య శ్రీపాద) అనే నలుగురు సాఫ్ట్‌వేర్‌ టెకీలు మంచి స్నేహితులు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లో నే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వుంటారు. చిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోకి మిత్ర వస్తుంది. చిష్ట్రీ ద్వారా విశ్వ‌కి మిత్ర ప‌రిచ‌యమ‌వుతుంది. దీంతో వీరిద్దరు ఫ్రెండ్స్‌ అయిపోతారు. అదికాస్త ముదిరి ప్రేమగా మారుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి (సందీప్, కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్) ఫ్లాట్ లోకి చొరబడి.. చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచేసి గాయాపరుస్తాడు. మిత్రను కూడా దారుణంగా చంపేస్తా అని ఆమెను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోయి… ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అలానే మిత్రను కూడా దారుణంగా చంపుతానని బెదిరిస్తాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే… మిత్రను వదిలేస్తా అంటాడు. అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రు?, విశ్వ‌ని ఎందుకు ఉరివేసుకుని చావ‌మ‌న్నాడు. ఆ వ్య‌క్తి నుండి విశ్వ మిత్ర‌, చిష్ట్రిల‌ను కాపాడాడా లేదా అనేది మిగ‌తా సినిమా క‌థ‌..

ఎవరెలా చేశారంటే...?
ఈ సినిమాలో పాత్రలు చాలా తక్కువ. వాళ్లు కూడా నేరుగా కలుసుకోరు. అంతా వెబ్‌ కెమెరాల ద్వారానే కలుసుకుంటారు. ఇల్లీగల్ హ్యాకర్ హెడ్ విశ్వగా అదిత్ అరుణ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చావుబతుకుల కొట్టుమిట్టాడే ప్రియురాలిని ఎలా కాపాడుకోవాలో తెలియక కొట్టుమిట్టాడే ఓ సిన్సియర్ లవర్ పాత్రలో లీనమై నటించాడు. . ‘అద్భుతం’తర్వాత శివానీ రాజశేఖర్‌ నటించిన మరో చిత్రం ఇదే. ఈ చిత్రంలో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదు కానీ.. ఉన్నంతలో బాగానే నటించింది. తెరపై చాలా క్యూట్‌గా కనిపించింది. ఇక  ప్రియదర్శి, దివ్య, సత్యం రాజేష్ వారి పాత్రలకు తగ్గట్టు చేశారు. కిల్లింగ్ వీరప్పన్ ఫేమ్ సందీప్ కూడా ఉన్న కాసేపు అయినా భయపెట్టి.. ప్రేక్షకులను అస‌లు సిస‌లు థ్రిల్ ను ప‌రిచ‌యం చేశాడు. వైవా హర్ష… త‌న‌ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. రియాజ్ ఖాన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి గా కనిపించి మెప్పించారు.

ఎలా ఉందంటే..?
ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాటా సైబర్‌ ఎటాక్‌. మనకు తెలియకుండా.. మన డేటాని హ్యాకర్లు దొంగిలించి ఇతరులకు అమ్ముకుంటున్నారు. దాని వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ఇదే కాన్సెప్ట్‌ని తీసుకొని  ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు కె.వి. గుహన్. సమకాలీన ప్రపంచంలో కంప్యూటర్ టెకీలు ఎలా తమకున్నటాలెంట్ ని దుర్వినియోగం చేసి… విలాసవంతమైన లైఫ్ కి అలవాటు పడి.. సమాజంలో ఎలా దోషులుగా మారుతున్నారనేదాన్ని అందరికి తెలిసేలా ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం… రెండు కంప్యూటర్ల స్క్రీన్ మీదనే సినిమా మొత్తం రన్ కావడం సూపర్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ ఐడియా దర్శకుడికి రావడమే నిజంగా అభినందిచాల్సిన విష‌యమే.

అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంతో కాస్త తడపడ్డాడు. విశ్వ, క్రిస్టీ, అష్రఫ్‌, సదాలు ఏం చేస్తారన్న దానితో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఆ తర్వాత విశ్వ-మిత్రల ప్రేమ కథతో సన్నివేశాలను సాగదీశాడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టింది. ఓ దుండగుడు  చిష్ట్రీ, మిత్రలు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి రావడం.. చిష్ట్రీని కత్తితో దాడి చేయడంతో సినిమాపై ఆసక్తి పెరుగుంది. ఆ ఆగంతకుడు ఎవరు? అతనికి విశ్వకి మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే దానికి దర్శకుడు చూపించిన రీజన్‌ మాత్ర చాలా పేలవంగా ఉంది. ఆగంతకుడి నేపథ్యాన్ని సాదాసీదాగా మాటల రూపంలో చెప్పించాడు అంతే. ఆగంతకుడి ప్లాష్‌ బ్యాక్‌ని ఇంకాస్త బలంగా చూపిస్తే.. సినిమా ఫలితం మరోలా ఉండేది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.

ఇక సాంకేతికత విషయానికొస్తే.. సైమన్‌ కె. కింగ్ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు.  గుహ‌న్ సినిమాటోగ్ర‌ఫి సినిమాకు చాలా ప్ల‌స్ అయింది. కొన్ని స‌న్నివేశాల్లో విజువ‌ల్స్ గూజ్‌బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. తమ్మిరాజు  ఎడిటింగ్‌ పర్వాలేదు. రామంత్ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రయత్నం మాత్రం బాగుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement