విజయ్‌భాస్కర్‌కు అవార్డు
ములుగు: ఉత్తమ సహాయ ఎన్నికల ఓటరు నమోదు అధికారిగా తహసీల్దార్ విజయభాస్కర్ శనివారం 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు, ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి విజయభాస్కర్ అందించిన సేవలను గుర్తించి రాష్ట్రం నుంచి ఆయనను రెఫర్ చేశారు.
పోలీస్‌స్టేషన్ల పరిశీలన
వాజేడు/వెంకటాపురం(కె): ఏజెన్సీలోని పలు పోలీస్ స్టేషన్లను శనివారం ఎస్పీ డాక్టర్ శబరీశ్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆలుబాక అవుట్ పోస్ట్, వెంకటాపురం(కె), వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ల ప్రస్తుత భద్రతా వ్యవస్థను పరిశీలించిన ఎస్పీ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలను తీసుకోవాలని ఆయా స్టేషన్ల ఎస్సైలకు సూచించారు. అదేవిధంగా మావోయిస్టుల కదలికలపై నిఘాను పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, వాజేడు, పేరూరు, వెంకటాపురం(కె) ఎస్సైలు ఉన్నారు.
రామప్పను సందర్శించిన యూరప్ దేశస్తులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం యూరప్‌కు చెందిన ఎడ్గార్స్, మిండు, పౌలివాస్‌లు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ తాడబోయిన వెంకటేశ్ వారికి వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు.
భూగర్భ జలాల పెంపునకు పాటుపడాలి
ములుగు రూరల్: భూగర్భ జలాల పెంపునకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేటలో యువతరం యూత్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నీటి నాణ్యతపై రైతులకు, విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రసాయనాలు, పరిశ్రమలు, గృహ మలినాలతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని తెలిపారు. గ్రామాలలో భూగర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా హైడ్రో జియాలజీ కృష్ణకాంత్ మాట్లాడుతూ భూమిలోని మూలకాల కారణంగా నీటి సాంద్రత మారుతూ ఉంటుందన్నారు. నీటిలో మూలకాలు సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే సాగుకు వినియోగంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, యువతరం యూత్ అధ్యక్షుడు అరవింద్, సభ్యులు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment