ఓటుహక్కును వినియోగించుకోవాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: ప్రతిఒక్కరూ నిష్పక్షపాతంగా కుల, మతాలకు అతీతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటును మించి లేదు– నేను ఖచ్ఛితంగా ఓటు వేస్తాను అనే థీమ్‌తో శనివారం నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సమావేశానికి అదనపు కలెక్టర్లు సంపత్‌రావు, మహేందర్‌జీతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన బీఎల్‌ఓలు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్‌సప్లయీస్ డీఎం రాంపతి, డీసీఓ సర్దార్‌సింగ్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు
ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు నూతన పథకాల ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రారంభోత్సవ కార్య క్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రతీ పథకం జాబితాలో అర్హులు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర జిల్లాలోని ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం అట్టహాసంగా చేపట్టాలని సూచించారు. ప్రతీ మండలంలో ప్రజాప్రతినిధులను సంప్రదించి వారి సూచనల మేరకు ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమానికి ముందు సీఎం సందేశంతో కూడిన వీడియోను ప్రదర్శించాలని తెలిపారు. జాబితాలో అనర్హులకు చోటు లేకుండా చూడడంతో పాటు విమర్శలకు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment