ఫలక్‌నూమా రైలులో మంటల కలకలం.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు | - | Sakshi
Sakshi News home page

ఫలక్‌నూమా రైలులో మంటలు.. ఒక్కసారిగా కలకలం.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

Published Sat, Jul 8 2023 8:18 AM | Last Updated on Sat, Jul 8 2023 10:25 AM

- - Sakshi

కోల్‌కతా నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌(రైలు నెంబర్‌ 12703)లో ప్రయాణికులు మరో అరగంటలో గమ్యస్థానానికి చేరుకోబోతున్నామనే ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో భీతిల్లిపోయారు. శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత రైలు బొమ్మాయిపల్లి – పగిడిపల్లి రైల్వే స్టేషన్‌ల మధ్యకు రాగానే ఒక్క కుదుపుతో ఆగింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు ప్రయాణికులు కిందకు దూకి దూరంగా పరుగెత్తారు. ముందుగా ఒక బోగీ నుంచి మంటలు, పొగ రావడం చూసి అన్ని బోగీలలోని ప్రయాణికులు ఉన్నఫలంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.
-సాక్షి, యాదాద్రి

ప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సెల్‌ఫోన్‌ చాటింగ్‌లో కొందరు, వస్తున్నామంటూ తమ బంధువులకు సమాచారం ఇచ్చే వారు మరికొందరు, నిద్రలో ఉన్నవారు ఇంకొందరు ఇలా ఎవరి పనుల్లో వారు ఉండగా.. బోగీలకు మంటలు వ్యాపించాయనే సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు రావడంతో అరుపులు, కేకలు పెట్టారు. ఏమైందో అర్ధంకాక, ఏం చేయాలో తెలియక, భయం ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిందకు దిగి పరుగులు తీశారు. పొగల వెంట మంటలు వస్తుండడంతో ప్రాణాలతో బయటపడతామా అంటూ కొందరు ఏడుపు మొదలు పెట్టారు.

రైలు ఆగడంతో ఒక్క ఉదుటున ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తినంతా కూడగట్టుకుని రైల్లోంచి కిందికి దూకారు. రైలు పక్కన ఉన్న ఎత్తయిన మట్టిదిబ్బలను ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. బతుకుజీవుడా అంటూ దొరికిన వాహనం పట్టుకుని గమ్యస్థానం వైపు వెళ్లిపోయారు. అయితే, ఈ ప్రమాదంలో తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో విలువైన లగేజీని మాత్రం రైల్లోని వదిలివేయడంతో మంటలకు కాలిబూడిదైంది. షార్ట్‌ సర్క్యూటో.. లేక ఎవరైనా కావాలని చేశారో, మానవ తప్పిదంతో జరిగిందో తెలియదు కానీ, పెద్ద ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు బోగీల నుంచి బయటకు దూకేశారు.

ఈ క్రమంలో తోపులాట జరిగింది. అత్యవసర కిటికీలో నుంచి బయటపడ్డారు. లగేజీ తక్కువగా ఉన్నవారు, మొత్తం లగేజీ లేని వారు ఒక్కో బ్యాగు ఉన్న వారు ముందుగా బయటపడ్డారు. ఓ వైపు మంటలు పెరిగిపోతున్నాయి.. బోగీ నుంచి మరో బోగీకి మంటలు వ్యాపిస్తున్నాయి. మరో వైపు కిక్కిరిసిన ప్రయాణికుల నుంచి బయటపడాలి. ఇంకో వైపు బ్యాగులు వెంట తీసుకుపోలేక నానా యాతనపడ్డారు. చూస్తుండగానే మంటలు బోగీ లకు వ్యాపించాయి. ప్రయాణికులంతా అప్పటికే దిగిపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.

ఎవరెక్కడున్నారో తెలియని అయోమయం
బోగీల్లో దట్టమైన పొగలు వ్యాపిస్తుండడంతో ఒకరికొకరు కనిపించని భయానక పరిస్థితి, కుటుంబ సభ్యులు ఎక్కుడున్నారో తెలియని ఆందోళన. అయినా తమ ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదని బతికి బయట పడాలన్న తపనతో ధైర్యం చేశారు. ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుని తమ చేతికి అందిన లగేజీ బ్యాగులతో బయటపడ్డారు.

బోగీ వెనక బోగీకి మంటలు
చిన్నగా రేగిన మంటలు వరుసగా బోగీలకు వ్యాపించాయి. దట్టమైన పొగలతో పగిడిపల్లి ప్రాంతం అంతా భయానక వాతావరణం నెలకొంది. ఎస్‌4, ఎస్‌5, ఎస్‌6, ఎస్‌3, ఎస్‌2 బోగీలు మంటలో చిక్కుకున్నాయి. మంటల ధాటికి ఇనుప చువ్వలు, సీట్లు, బోగి పైబర్‌ అన్ని కాలుకుంటూ బోగీ మొత్తం వ్యాపించాయి. ఒక దాని తర్వాత మరొకటి చొప్పున మొత్తం 5 బోగీలు కాలిపోయాయి. మరో రెండు బోగీలు స్వల్పంగా కాలిపోయాయి.

మైనారిటీ గురుకుల విద్యార్థుల సహాయక చర్యలు
రైలులో మంటలు చెలరేగిన ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సి పాల్‌ శ్రీకాంత్‌ గుర్తించి మీడియా, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే పాఠశాల టీచర్లు, విద్యార్థులు వెంటనే స్పందించి ప్రయాణికులను రైలు నుంచి జాగ్రత్తగా దింపి వారికి సహాయపడ్డారు. వారందరిని మైనారిటీ పాఠశాలకు చేర్చి మంచినీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించారు. ఆటోలో హైవే వరకు చేర్చటం, అలాగే మిగిలిన ప్రయాణికులకు, పోలీసులకు, సహాయక సిబ్బందికి భోజనం వసతి ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, ఆర్డీఓ భూపాల్‌ రెడ్డి, పోలీసు అధికారులు పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు.

సహాయక చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే
ఫలక్‌నూమా రైలు అగ్ని ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. అధికారులతో ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించారు.

నా సర్టిఫికెట్లు కాలిపోయాయి

నేను ప్రయాణం చేస్తున్న రైలు బోగి దగ్ధమైంది. నేను, మా అమ్మనాన్నతో కలిసి హైదరాబాద్‌కు వెళ్తున్నాం. మా వద్ద మొత్తం 9 లగేజీ బ్యాగులు ఉన్నాయి. భయంతో నాలుగు బ్యాగులు మాత్రమే తీసుకుని కిందికి దిగాం. పదవ తరగతి, ఇంటర్‌, ఇంజనీరింగ్‌ సర్టిపికెట్లు అన్నీ బ్యాగులోనే ఉన్నాయి. బ్యాగులన్నీ కాలిపోయాయి. అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్‌కు నా బాధను చెప్పాను. సర్టిఫికెట్లు జారీ కోసం సహాయం చేస్తాని హామీ ఇచ్చారు.
– యశ్విత, ప్రయాణికురాలు, ఒడిశా

చైన్‌ లాగి కిందికి దూకిన రాజు
రైలులో పొగలు, మంటలు చెలరేగుతుండడంతో ప్రమాదాన్ని పసిగట్టి అందులో ప్రయాణిస్తున్న రాజు అనే ప్రయాణికుడు రైలు చైన్‌ లాగి పక్కనే ఉన్న తన తల్లితో చెప్పి కిందికి దూకేశాడు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. స్పృహతప్పి కింద పడిపోయాడు. పోలీస్‌లు రాజును భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు.

సమన్వయంతో అదుపులోకి – కలెక్టర్‌ పమేలా సత్పతి
అన్ని శాఖల సమన్వయంతో మంటలు ఆర్పినట్లు భువనగిరి కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రయాణికులకు ఆహార సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మెడికల్‌ టీమ్స్‌ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

రాచకొండ సీపీ ఆధ్వర్యంలో..
రైలు అగ్నిప్రమాదానికి గురైన ప్రదేశాన్ని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ సందర్శించారు. రైల్వే శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ డీసీపీ అభిషేక్‌ మహంతి, యాదాద్రి డీసీపీ రాజేష్‌ చంద్ర, ఇతర అధికారులు కమిషనర్‌ వెంట ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement