ఓటింగ్‌పై అవగాహన గ్రామీణ ఓటర్ల కంటే.. పట్టణ ఓటర్లకే తక్కువ.. | - | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌పై అవగాహన గ్రామీణ ఓటర్ల కంటే.. పట్టణ ఓటర్లకే తక్కువ..

Published Sat, Oct 21 2023 1:38 AM | Last Updated on Sat, Oct 21 2023 12:10 PM

- - Sakshi

‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌

నల్లగొండ: ‘పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే.. పట్టణ ప్రాంతాల్లోని వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. నల్లగొండ, మిర్యాలగూడ, నందికొండ వంటి అర్బన్‌, మున్సిపల్‌ ప్రాంతాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైంది.

ఈసారి దానిని పెంచేందుకు అవగాహన కల్పిస్తున్నాం’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని, ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. కలెక్టర్‌ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

పట్టణాల్లో 356 పోలింగ్‌ స్టేషన్లు
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో చాలా తక్కువ పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1,766 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా.. మున్సిపల్‌, పట్టణ ప్రాంతాల్లో కేవలం 356 పోలింగ్‌ స్టేషన్లే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 1,410 పోలింగ్‌ కేంద్రాల పరిధిలోనే దాదాపు 80 శాతం వరకు ఓటర్లు ఉన్నారు. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తంగా 14,26,480 ఓటర్లు ఉన్నారు.

ఏర్పాట్లు ముమ్మరం
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. శుక్రవారం నుంచే ఈవీఎంలను నియోజకవర్గాలకు పంపిస్తున్నాం. శనివారం నాటికి అవి నియోజకవర్గాలకు చేరుతాయి. ఒక్కో నియోజకవర్గానికి అవసరమైన ఈవీఎంల సంఖ్య కంటే అదనంగా 25శాతం ఈవీఎంలను పంపిస్తున్నాం. అనుకోకుండా ఏదైనా పని చేయకపోయినా, రిపేర్‌ వచ్చినా ఉపయోగించుకునేలా వాటిని అందుబాటులో ఉంచుతున్నాం.

సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌
జిల్లాలో 521 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించాం. వాటి వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. వాటిల్లో మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. వీడియో కెమెరాల రికార్డింగ్‌ ఏర్పాటు చేస్తాం. వెబ్‌ క్యాస్టింగ్‌ ఉంటుంది.

నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి..
ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నగదు, విలువైన వస్తువుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటివరకు పోలీసు, ఇతర శాఖలు రూ.11.54కోట్ల నగదును పట్టుకోగా, రూ.27.49కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను పట్టుకున్నాయి. గురువారం ఒక్కరోజే పెద్ద మొత్తంలో సీజ్‌ చేశారు.

అది ఎన్నికల రిలేటెడ్‌ కాకపోయినా డాక్యుమెంట్లు లేకపోవడంతో సీజ్‌ చేశాం. పన్ను ఎగవేసేందుకు డాక్యుమెంట్లు లేకుండా బంగారాన్ని విజయవాడవైపు తీసుకెళ్తున్నట్లు గుర్తించాం. దానిని కమర్షియల్‌ టాక్స్‌ విభాగానికి అప్పగించాం. టాక్స్‌ ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు కనుక జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇప్పటివరకు మొత్తంగా దాదాపు రూ.40కోట్ల విలువైన డబ్బు, వస్తువులు సీజ్‌ చేయగా, రూ.3కోట్ల డబ్బుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ అయింది. ఎఫ్‌ఆర్‌ లేకుండా మరో 3,26,24,000 సీజ్‌ చేశాం. అందులో రూ.2.89కోట్లు రిలీజ్‌ చేశాం. రూ.10లక్షల కంటే ఎక్కువ ఉంటేనే సమస్య వస్తోంది. వారే లెక్కలు చూపించుకోవాలి.

24 గంటల్లో డాక్యుమెంట్లు సబ్మిట్‌ చేస్తే రిలీజ్‌ చేస్తాం. లేదంటే ఆదాయ పన్నుల శాఖకు వారికి అప్పగిస్తాం. వారికి లెక్కలు చూపించుకోవాల్సి ఉంటుంది. వారు రిలీజ్‌ చేయమంటేనే చేస్తాం.

86 ఫిర్యాదులు పరిష్కరించాం
ఎన్నికలు, కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి సి–విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు 113 ఫిర్యాదులు రాగా, అందులో సరైనవి 86 ఫిర్యాదులను పరిష్కరించాం. మిగతావి సరైనవి కావు. ఉల్లంఘనలపై 1950 టోల్‌ ఫ్రీ నంబరులో ఫిర్యాదు చేస్తే.. 100 నిమిషాల్లో పరిష్కరిస్తాం.

వృద్ధులు, వికలాంగులకు హోం బేస్డ్‌ ఓటింగ్‌
80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు హోంబేస్డ్‌ (ఇంటి నుంచి) ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తాం. జిల్లాలో వికలాంగులు 32వేల మంది ఉండగా, వృద్ధులు 17వేల మంది ఉన్నారు. పోలింగ్‌ స్టేషన్‌కు రాలేను అనుకున్నవారికే ఈ అవకాశం కల్పిస్తాం. రావాలనుకునే వారు రావచ్చు.. రాలేని వారు ఫారం 12(డి) సబ్మిట్‌ చేయాలి.

వికలాంగులైతే 40శాతం వైకల్యం ఉన్న సదరం సర్టిఫికెట్‌ ఉండాలి. మునుగోడు ఎన్నికల్లో వెయ్యి మంది హోంబేస్డ్‌ ఓటింగ్‌ వినియోగించుకున్నారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాం

డాక్యుమెంట్‌తోనే డబ్బు తీసుకెళ్లండి
ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్తున్నప్పుడు వాటికి సంబంధించి డాక్యుమెంట్లు, ప్రూఫ్‌ కచ్చితంగా తీసుకెళ్లండి, నగదు రవాణాతో మిస్‌ యూజ్‌ జరిగే అవకాశం ఉన్నందును ఎన్నికల కమిషన్‌ ఈ నిబంధన విధించింది.

వీలైతే ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండి. క్యాష్‌ తీసుకెళ్తే మాత్రం ప్రూఫ్‌ ఉండేలా చూసుకోండి. సీజ్‌ చేసిన మొత్తాన్ని విడిపించుకునేందుకు జిల్లా గ్రీవెన్స్‌ కమిటీకి దరఖాస్తు చేసుకోండి. డాక్యుమెంట్లు సమర్పిస్తే ఒక్క రోజులోనే రిలీజ్‌ చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement