మాజీ సర్పంచ్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Published Fri, Jan 31 2025 1:39 AM | Last Updated on Fri, Jan 31 2025 1:39 AM

మాజీ సర్పంచ్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

మాజీ సర్పంచ్‌ హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

నల్లగొండ: శాలిగౌరారం మండలం ఉప్పలంచ మాజీ సర్పంచ్‌ బండారు మల్లయ్యను హత్య చేసిన కేసులో 12 మందిని నిందితులుగా గుర్తించగా.. అందులో ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప్పలంచ గ్రామంలో ఎస్సీల కుల దైవం పాపమ్మ దేవతకు పూర్వీకులు కొంత భూమి వదిలిపెట్టారు. ఈ భూమిని రుద్రారపు యాదగిరి, రుద్రారపు మల్లయ్య, రుద్రారపు యాదగిరి అలియాస్‌ చిన్నయాదగిరి, రుద్రారపు నర్సింహ, బండారు యాదయ్య అలియాస్‌ టీచర్‌ యాదయ్య ఆక్రమించారు. ఈ విషయమై పంచాయితీ పెట్టగా.. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్‌ వేయడంతో పాటు ఆక్రమించిన వారిని కుల బహిష్కరణ చేశారు. తమను కుల బహిష్కరణ చేయడానికి మాజీ సర్పంచ్‌ బండారు మల్లయ్య కారణమని అతడిపై కక్ష పెంచుకున్నారు. భూమి కోల్పోయిన వారు హైదరాబాద్‌కు చెందిన సపారీ గ్యాంగ్‌తో చేతులు కలిపారు. రుద్రారపు యాదగిరి తనకు పరిచయం ఉన్న సూర్యాపేట జిల్లా నాగారం మండలం మంచిరెడ్డిపల్లికి చెందిన తాడోజు శ్రీకాంతరాజు (ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు)ను ఆశ్రయించాడు. శ్రీకాంతరాజు హైదరాబాద్‌కు చెందిన సూరారపు యాదగిరి, కొంపెల్లి చంద్రమౌళి, కొంపెల్లి శ్రీనివాస్‌, సూరారపు నర్సింహతో మాట్లాడి మల్లయ్యను చంపేందుకు రూ.11 లక్షలు సుపారీ నిర్ణయించి రూ.4.75 లక్షలు చెల్లించారు. వీరంతా జనవరి మొదటి వారంలో మల్లయ్యను చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మళ్లీ ఈ నెల 21వ తేదీన మల్లయ్య వ్యవసాయ బావి నుంచి బైక్‌పై ఇంటికి వస్తుండగా.. దారికాచి కర్రలతో విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఈ కేసులో మొత్తం 12 మంది పాలుపంచుకోగా ఏడుగురిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించామని, మిగతా ఐదుగురిని త్వరలో పట్టుకుని రిమాండ్‌కు పంపుతామని డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement