డబు్బలు ఊరికే రావు!
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిరక్షరాస్యులు మొదలుకుని విద్యావంతులు, వ్యాపారులు, అధికారులు ఇలా సైబర్ నేరగాళ్లు ఎవర్నీ వదలడం లేదు. సోషల్ మీడియాలో వచ్చిన లింక్‌లు నొక్కడం వల్ల భారీగా డబ్బులు కోల్పోతున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ గురువారం సైబర్ క్రైం బ్యూరో డీఎస్పీ లక్ష్మీనారాయణతో ‘ఫోన్ ఇన్’ నిర్వహించింది. ఈ కార్యక్రమాని భారీ స్పందన వచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున ఫోన్ ద్వారా అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. కొందరి ఫిర్యాదులను విన్న డీఎస్పీ.. వెంటనే సంబంధిత స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. నల్లగొండ
ప్రశ్న : నేను ఐదు నెలల క్రితం టెలిగ్రామ్‌లో ఒక యాడ్ చూశాను. ఇంట్లో ఉండే డబ్బు సంపాదించవచ్చని ఉంది. వారు మొదట రూ.2 వేలు పెట్టండి.. మీకు రూ.3000 వస్తాయని చెప్పారు. రూ.2 వేలే కదా అని ఆన్‌లైన్‌లో పంపా. నాలుగు రోజులు రూ.400 చొప్పున డ్రా చేసుకోమని చెబితే చేశాను. నా డబ్బులకు వారు కొంత కలిపి రూ.5000 బ్యాలెన్స్ చూపించారు. ఐదో రోజు విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఐదో రోజు రూ.వెయ్యి కలుపమన్నారు. మళ్లీ రూ.6 వేలు కలపమన్నారు. రూ.6 వేలు నేను జమ చేస్తే వారు దాన్ని రూ.20 వేలు చేశారు. దీంతో నాకు ఆశ కలిగింది. ఇంకా రూ.13 వేలు వేయాలని చెప్పారు. నేను రూ.15 వేలు వేశాను. దాంతో నా అకౌంట్‌లో రూ.90 వేలు చూపారు. డ్రా చేసుకుంటానంటే రూ.26 వేలు వేయాలని.. అప్పుడు డ్రా చేసుకోవచ్చని చెప్పారు. నాకు ఏమీ వద్దు అందులో సగం డబ్బులు ఇవ్వండి అన్నాను. ఫోన్ కట్ అయింది. మోసపోయానని తెలుసుకున్నాను. –కుమార్, నార్కట్‌పల్లి
డీఎస్పీ : ఎవరూ మనకు డబ్బులు ఊరికే ఇవ్వరు. కష్టపడితేనే డబ్బు వస్తుంది. సైబర్ మోసగాళ్లు మనకు ఆశ చూపి మన డబ్బులు కొట్టేస్తారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ప్రశ్న : పెట్రోలు బంక్ పెడదామన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో వచ్చిన ఓ యాడ్‌ను ఓపెన్ చేశాను. అన్ని డాక్యుమెంట్స్ అడిగారు.. విడతల వారీగా రూ.13 లక్షలు వారి అకౌంట్లలో వేశాను. ఆ తర్వాత మోసాపోయానని తెలుసుకుని కేసు పెట్టాను. –లక్ష్మీనారాయణ, అంగడిపేట, పీఏపల్లి మండలం
డీఎస్పీ : ఈ విషయంపై సీఐతో మాట్లాడి కేసు పురోగతి తెలుసుకుంటాను. మూడు నెలల క్రితమే బిహార్‌కు చెందిన నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఏ విధంగా డబ్బులు రాబట్టాలనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఫ సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
ఫ ఆన్‌లైన్ లింక్‌లు ఓపెన్ చేయొద్దు
ఫ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు
ఫ సైబర్ నేరగాళ్లు ఎక్కడో ఉండి..
మన అకౌంట్లను ఆపరేట్‌చేస్తారు
ఫ అకౌంట్‌లో డబ్బు పోయిందని
తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేయండి
‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో సైబర్ క్రైం బ్యూరో డీఎస్పీ లక్ష్మీనారాయణ
ప్రశ్న : నా ఫోన్ ఈ నెల 20వ తేదీన పోయింది. కొత్త ఫోన్ తీసుకుని అదే నంబర్‌తో ఉన్న సిమ్ వేశాను. వెంటనే ఫోన్ పేలో అకౌంట్ బ్యాలెన్స్ చూస్తే రూ.2లక్షలు లేవు. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేశాను. – ఇంతియాజ్, నల్లగొండ
డీఎస్పీ : ఈ కేసులో పోలీసులు కొంత డబ్బు సీజ్ చేయగలిగారు. మిగిలిన డబ్బు కూడా ఎక్కడుందో విచారణ చేస్తున్నారు. ఉన్న డబ్బును కోర్టు ద్వారా మీకు అందిస్తారు.
ప్రశ్న : నాకు ఆరు నెలలుగా ఎవరో వాట్సప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ న్యూడ్ వీడియోలు పంపుతున్నారు. అవి రాకుండా చూడగలరు.
– దేవర వెంకన్న, సుందర్‌నగర్, మిర్యాలగూడ
డీఎస్పీ : మీ ఫోన్‌కు అలాంటి కాల్స్ రాకుండా.. ఆ నంబర్‌ను సీజ్ చేస్తాం. మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే మీ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో సైబర్ వారియర్‌ను కలవండి.
ప్రశ్న : నల్లగొండ ప్రకాశంబజార్‌లో ఎలక్ట్రికల్ షాపు ఉంది.. ఓ కస్టమర్ వచ్చి వస్తువు తీసుకుని ఫోన్ పే చేస్తానని చెప్పి నా పోన్ ఓపెన్ చెప్పాడు. మళ్లీ వస్తానని వెళ్లిపోయాడు. తర్వాత చూస్తే రూ.98 వేలు కట్ అయ్యాయి. వెంటనే వన్‌టౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.
– పాలకూరి శివలింగం, నల్లగొండ, ప్రకాశంబజార్
డీఎస్పీ : ఈ కేసు విషయంలో డీఎస్పీ వన్‌టౌన్ ఎస్‌ఐతో ఫోన్‌లో మాట్లాడి కేసు వివరాలు తీసుకుని సంబంధిత బ్యాంకు వారితో మాట్లాడించారు. అతని డబ్బు కొంత మేర పోలీసులు సీజ్ చేశారు. ఆ డబ్బును వెంటనే బ్యాంకు వారితో మాట్లాడి బాధితుడు శివలింగానికి ఇప్పించారు.
ప్రశ్న : ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు ఫ్రాడ్ జరిగింది. అందులో నుంచి విడతల వారిగా రూ.2 లక్షల 84 వేలు షాపింగ్ చేశారు. నేను 40 నిమిషాల్లోనే కేసు పెట్టాను. అప్పటికే డబ్బులు డ్రా అయ్యాయి. ఈ విషయమై న్యాయం చేయాలి.
– ఏడుకొండలు, కొండమల్లేపల్లి
డీఎస్పీ : ప్రాడ్ స్టార్స్ అంతా ఇక్కడ వాళ్లు కాదు. బయట దేశాల్లో ఉంటున్నారు. అక్కడ ఉండి మన ఖాతాలను ఆపరేట్ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఏదో ఒకచోట పట్టుబడతారు. డబ్బులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తాం.
ప్రశ్న : మా మండలంలో కొందరు ఏజెంట్ల రూపంలో వచ్చి రూ.లక్ష పెడితే రూ.లక్ష వస్తుందని నమ్మబలికి దాదాపు 150 మంది నుంచి డబ్బు వసూలు చేశారు. నేను నాలుగున్నర లక్షలు ఇచ్చాను. మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు. స్టేషన్‌లో కేసు పెట్టాం.
– నర్సింహ, మర్రిగూడ
డీఎస్పీ : డీఎస్పీ వెంటనే సదరు ఎస్‌ఐతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు వివరాలు తెలుసుకున్నారు. డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని అరెస్టు చేస్తే.. వాడుకున్నామని చెబుతున్నారని.. ఆ డబ్బులు వారు ఎవరికి ఇచ్చారనే దానిపై విచారణ చేసి డబ్బు రాబడతామని చెప్పారు.
ప్రశ్న : నెల క్రితం బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్ చేశారు. ఓటీపీ చెప్పమంటే.. చెప్పారు. దీంతో మా అకౌంట్‌లో రూ.లక్ష పోయాయి. మా డబ్బులు తిరిగి రావాలంటే ఏమి చేయాలి.
– దామెర ఉత్తరయ్య, దామెర, నాంపల్లి మండలం
డీఎస్పీ : బ్యాంకు నుంచి ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడగరు. డబ్బులు పోయాయని తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే డ్రా అయిన డబ్బులు ఏ అకౌంట్‌లోకి వెళ్లాయో అక్కడ వారి ఖాతాలను సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా కేసు పెట్టండి. పోలీసులు విచారిస్తారు.
ప్రశ్న : సైబర్ నేరాలతో మోసపోకుండా ఏం చేయాలి? – హరీష్, అడవిదేవులపల్లి,
వెంకట రమణ, దేవరకొండ
డీఎస్పీ : గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పింది నమ్మవద్దు. ఏ బ్యాంకు వారు కూడా ఓటీపీ అడగరు. ఉద్యోగాలిస్తామని, పెట్టుబడులు పెడితే డబుల్ అవుతాయని ఆన్‌లైన్‌లో పంపే లింక్‌లు ఓపెన్ చేయొద్దు. అలా చేస్తే.. మీకు తెలియకుండానే మీ అకౌంట్‌లో డబ్బు మాయమవుతుంది. దురాశకు పోయి దుఃఖానికి తెచ్చుకోవద్దు. సైబర్ మోసంలో డబ్బులు పోగొట్టుకున్నామని తెలిసిన వెంటనే 1930కు పోన్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment