జిల్లాలో 28 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో 28 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు

Published Wed, May 8 2024 7:25 AM

-

కర్నూలు(సెంట్రల్‌): ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు జిల్లాలో 28 మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళల నిర్వహణలో 8, యువత నిర్వహణలో రెండు, దివ్యాంగుల నిర్వహణలో మరో 2 ప్రత్యేక పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పత్తికొండలో 5, కోడుమూరులో 4, కర్నూలులో 1, ఎమ్మిగనూరులో 3, పాణ్యంలో 4 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మహిళలు, యువత, దివ్యాంగులకు ఓటుపై అవగాహన కల్పించేందుకు ఇవి ఎంతోగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక పోలింగ్‌ కేంద్రం మహిళల నిర్వహణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత ఆధ్వర్యంలో నడిచే పోలింగ్‌ స్టేషన్లలో ఒక్క దానిని ఆదోనిలో, మరో దానిని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల సమక్షంలో ఏర్పాటు చేసే ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాల్లో రెండింటిని కర్నూలు నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

యువతి ఆత్మహత్యాయత్నం

ఆదోని అర్బన్‌: పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు చెప్పిన మాటలు నమ్మి మోసపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఓ యువతి ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. యువతి, బంధువులు పోలీసులకు తెలిపిన వివరాలు.. ఎమ్మిగనూరు మండలం దేవిబెట్ట గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌కుమార్‌ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రశాంత్‌కుమార్‌ లోబరుచుకున్నాడని యువతి తెలిపింది. అనంతపురంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆదోనికి తీసుకొచ్చాడని చెప్పింది. ఆదోనిలో కొత్త బట్టలు తీసుకుందామని తీసుకెళ్లి దృష్టిమరల్చి ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. ఎంతసేపటికీ తిరిగిరాకపోగా ఫోన్‌కు నిన్ను పెళ్లి చేసుకోను అని ప్రశాంత్‌కుమార్‌ నుంచి మెసేజ్‌ రావడంతో మనస్తాపానికి గురై ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే స్థానికులు ఆదోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement