జూపాడుబంగ్లా: శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రతో వెళ్లే భక్తులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణ అన్నారు. మండ్లెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. వైద్య శిబిరాలకు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన భక్తులు వస్తే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాదయాత్ర భక్తులు వైద్య శిబిరాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. మధ్యాహ్న సమయంలో పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం జిల్లాలో బ్రాహ్మణకొట్కూరు, మండ్లెం, నందికొట్కూరు, ఆత్మకూరు, వెంకటాపురం, గూడెం, పెద్ద చెరువు ప్రాంతాలతో పాటు పలుచోట్ల 13 వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం జూపాడుబంగ్లా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్ యశశ్విని తదితరులు ఉన్నారు.
శ్రీశైలానికి పోటెత్తిన కన్నడిగులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రానికి కన్నడ భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కన్నడ భక్తులతో శ్రీగిరి క్షేత్రం నిండిపోయింది. ఆదివారం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులు తీరారు. కన్నడ భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. కన్నడ భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగుతుంది. ఈ నెల 27వ తేదీ నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీంతో కన్నడ భక్తులు మల్లన్న స్పర్శదర్శనం చేసుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే స్పర్శదర్శనం టికెట్టు ఇచ్చేందుకు కౌంటర్లు పెంచా లని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి