కర్నూలు (అర్బన్): జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు ఏప్రిల్ 14వ తేదీ వరకు నీటి సరఫరా జరుగుతున్నందున ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎస్‌ఎస్ ట్యాంకులన్నిటినీ నింపుకోవాలని జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం స్థానిక జెడ్పీ మినీ సమావేశ భవనంలో తాగునీటి ఎద్దడి, జెడ్పీ నిధులతో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై ఆయన పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా పథకాలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో నీటి వృథాను అరికట్టేందుకు పైప్‌లైన్ల లీకేజీలను వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాపరిషత్ నిధుల ద్వారా మంజూరైన ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు మంజూరు చేసిన ఈఎంఎఫ్ పనులను వెంటనే చేపట్టి జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పనులకు సంబంధించి ఐసీడీఎస్ అధికారులను సమన్వయం చేసుకుని పంచాయతీరాజ్ ఇంజనీర్లు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ కర్నూలు, నంద్యాల ఎస్‌ఈలు బి.నాగేశ్వరరావు, సీహెచ్ మనోహర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి