
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం
నంద్యాల: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద జిల్లాలో ఎంపికై న 19 గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గ్రామ సర్పంచులు, ఎంపీడీఓలకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆదర్శ గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జెడ్పీ డిప్యూ టీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద పార్లమెంటు సభ్యులు వారి పదవి కాలంలో ఒక్కొ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసేవారన్నారు. ఇందుకు అనుబంధంగా ఈ పథకాన్ని ప్రధానంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు చాగలమర్రి మండలం మద్దూరు, పెద్దబోదనం, పాణ్యం మండలం గోనవరం, కొండజూటూరు, జూపాడుబంగ్లా మండలం పి.గణపురం, నంద్యాల మండలం రాయమల్పురం, రుద్రవరం మండలం పెద్దకంబలూరు, వెలుగోడు మండలం అబ్దుల్లాపురం, గోస్పాడు మండలం సాంబవరం, పసురపాడు, బేతంచెర్ల మండలం గోర్లగుట్ట, కోవెలకుంట్ల మండలం సౌదరిదిన్నె, మహానంది మండలం తమ్మడపల్లి, మసీదుపురం, పాములపాడు మండలం వేంపెంట, మిడ్తూరు మండలం అలగనూరు, చెరుకు చెర్ల, ఆత్మకూరు మండలం వడ్లరామపురం, ఆళ్లగడ్డ మండలంలోని పాతకందూరు గ్రామాలను ఎంపిక చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఏ టా రూ. 20 లక్షలు మంజూరు చేయడంతో పాటు అద నంగా అడ్మిన్ కాస్ట్ పరంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నిధులతో అధిక శాతం సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.