
లక్నో: వావివరుసలు.. వయసు బేధం లేకుండా కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు దేశంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఎనభై ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లొచ్చేలోపు ఆ ముసలావిడపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా ఖరేలా పట్టణం సమీప గ్రామంలో ఫిబ్రవరి 2వ తేదీన కుటుంబసభ్యులు ఆలయానికి వెళ్లారు.
దీంతో ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించి ఆ పెద్దావిడపై అత్యాచారం చేశారు. ఇంటికి చేరిన కుటుంబసభ్యులకు ఈ విషయం వివరించి ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమె మనవడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే జలాల్‌పూర్ ప్రాంతంలోని హమీర్‌పూర్‌కు చెందిన పూల్‌చంద్, మరో వ్యక్తి నిందితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖరేలా ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.