మొత్తం 90 స్థానాల్లో పోటీకే మొగ్గు
ఢిల్లీ–పంజాబ్ సరిహద్దుల వెంట ఉన్న 27 నియోజకవర్గాలపై ఫోకస్
కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ
ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రుల భార్యలు ప్రచారంలోకి
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రస్తుత హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిధ్దమైంది. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న హరియాణాలో వీలైనన్ని ఎక్కువ సీట్లలో గెలవడం ద్వారా తన బలాన్ని పెంచుకునే ఎత్తులు వేస్తోంది. రాష్ట్రంలోని 90 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిధ్దమైన ఆప్ ఢిల్లీ, పంజాబ్‌ల సరిహద్దుల వెంట ఉన్న 27 నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
పొత్తులకు దూరంగా.. ఒంటరి పోరాటం
2019 ఎన్నికల్లోనూ హరియణా అసెంబ్లీలో 46 స్థానాల్లో పోటీ పడిన ఆప్ కేవలం 0.48 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. ఆ పారీ్టకి చెందిన 35 మందికి పైగా అభ్యర్థులకు వెయ్యి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల అనంతరం మొదలైన రైతు ఉద్యమాల సమయంలో ఆప్ ఆ రాష్ట్రంలో పుంజుకునే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీ ముట్టడికి పిలుపునిచి్చన హరియాణా రైతులకు అటు పంజాబ్‌లోని, ఇటు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సహకరించింది. ఆప్‌కు పెరిగిన బలాన్ని దృష్టిలో పెట్టుకునే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో పొత్తులు పెట్టుకుంది.
హరియాణాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు గానూ ఆప్ కురుక్షేత్ర నుంచి ఒక్క స్థానంలోనే పోటీ చేసింది. ఆప్ పార్టీ అభ్యర్థి సుశీల్ గుప్తా 29,021 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీకి చెందిన నవీన్ జిందాల్ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న ఆప్, రాష్ట్రంలోని పెహోవా, షహబాద్, కలయత్, గుహ్లా, అంబాలా, తోహానా, రతియా, నర్వానా, రానియా, కలన్‌వాలి, దబ్వాలీ, సోహ్నా, బల్లాబ్‌ఘర్, బహదూర్‌ఘర్‌తో వంటి సరిహద్దు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ ఇక్కడ ఇప్పటికే ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ భార్య గురుప్రీత్ కౌర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం మొదలు పెట్టారు. తమ పార్టీ ప్రధాన హామీలైన ఉచిత విద్యుత్, యువతకు ఉపాధి, ప్రతి విద్యారి్థకి ఉచిత విద్య, ఉచిత వైద్యం, 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ. వెయ్యి సాయం అంశాలను వారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో అభ్యర్థుల ప్రకటన పూర్తయిన వెంటనే ఆప్ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది. హరియాణాలో అక్టోబర్ ఒకటిన ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment